షార్జా: ఐపీఎల్14 ఫైనల్ బెర్తు కోసం ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో క్వాలిఫైయర్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న కోల్‌కతా బౌలర్లు ఢిల్లీ జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. కోల్‌కతా కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఢిల్లీ బ్యాట్స్మెన్లలో ఎవరూ బ్యాటు ఝుళిపించలేకపోయారు.
పృథ్వీ షా (18) తక్కువ స్కోరే చేసినా మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (36) నిలకడైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే వీరిద్దరినీ పెవిలియన్ చేర్చిన వరుణ్ చక్రవర్తి కోల్‌కతా జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన మార్కస్ స్టొయినిస్‌ను శివమ్ మావి బౌల్డ్ చేశాడు. శ్రేయాస్ అయ్యర్ (30 నాటౌట్) అజేయంగా నిలిచినప్పటికీ భారీ షాట్లు ఆడలేకపోయాడు. కెప్టెన్ రిషభ్ పంత్ (6) విఫలమయ్యాడు. చివర్లో షిమ్రాన్ హెట్మెయర్ (17) రెండు సిక్సర్లు బాదినా వెంటనే రనౌట్‌గా వెనుతిరిగాడు. అక్షర్ పటేల్ (4) కూడా భారీ షాట్లు ఆడలేకపోయాడు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేనాటికి 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టు కేవలం 135 పరుగులు మాత్రమే చేసింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లుతో సత్తా చాటగా శివమ్ మావి, లోకీ ఫెర్గూసన్ చెరో వికెట్ తీసుకున్నారు.