e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home స్పోర్ట్స్ ఢిల్లీ Xకోల్‌కతా

ఢిల్లీ Xకోల్‌కతా

  • నేడు క్వాలిఫయర్‌-2 పోరు l రాత్రి 7.30 నుంచి

లీగ్‌ దశలో అత్యధిక విజయాలతో ప్లే ఆఫ్స్‌ చేరి.. క్వాలిఫయర్‌-1లో చెన్నై చేతిలో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తుదిపోరుకు చేరాలని తహతహలాడుతుంటే! నాకౌట్‌ మ్యాచ్‌లో బెంగళూరును ఇంటి దారి పట్టించిన కోల్‌కతా అదే జోరులో టైటిల్‌ ఫైట్‌కు అర్హత సాధించాలని చూస్తున్నది. ఇప్పటికే చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు శుక్రవారం జరుగనున్న బిగ్‌ ఫైట్‌లో ధోనీ సేనతో తలపడనుంది. మరి బ్యాటింగే బలంగా బరిలోకి దిగుతున్న ఢిల్లీకి ఆ అవకాశం దక్కుతుందా.. లేక స్పిన్నర్లే ప్రధానాస్ర్తాలుగా ముందుకు సాగుతున్న కోల్‌కతా ముందంజ వేస్తుందా నేడు తేలనుంది!

షార్జా: గత మూడు సీజన్‌ల నుంచి నిలకడగా రాణిస్తూ ప్రతిసారీ ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్టు ఓ వైపు.. టాపార్డర్‌ మెరుపులకు స్పిన్నర్ల అండ తోడవడంతో అద్భుతాలు చేస్తున్న టీమ్‌ మరోవైపు! దేశీ ఆటగాళ్లే ప్రధాన బలంగా బరిలో దిగుతున్నది ఒకరైతే.. విదేశీ ఆటగాళ్ల పైనే భారం మోపి ముందుకు సాగుతున్నది మరొకరు. ఐపీఎల్‌ 14వ సీజన్‌లో రెండో ఫైనలిస్ట్‌ ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. క్వాలిఫయర్‌-1లో చెన్నై చేతిలో ఖంగుతిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫైనల్‌ చేరి ధోనీ సేనపై ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతుంటే.. ఎలిమినేటర్‌లో బెంగళూరును చిత్తు చేసిన కోల్‌కతా అదే జోష్‌లో ఢిల్లీపై నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించాలని భావిస్తున్నది. స్పిన్నర్లకు సహకరిస్తున్న స్లో పిచ్‌పై నేడు ఢిల్లీ, కోల్‌కతా మధ్య క్వాలిఫయర్‌-2 జరుగనుంది. పృథ్వీషా, శిఖర్‌ ధవన్‌, రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, హెట్‌మైర్‌ రూపంలో ఢిల్లీ టాపార్డర్‌ బలంగా కనిపిస్తుండగా.. సునీల్‌ నరైన్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, వరుణ్‌ చక్రవర్తి రూపంలో ముగ్గురు మేటి స్పిన్నర్లు కోల్‌కతాకు అందుబాటులో ఉన్నారు. మరి స్పిన్నర్లు రాజ్యమేలి కోల్‌కతాను గట్టెక్కిస్తారో.. బ్యాటర్లు విజృంభించి ఢిల్లీని ఫైనల్‌ చేరుస్తారో చూడాలి!

పేస్‌ ఆల్‌రౌండర్‌ లేక..

- Advertisement -

ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తూ.. లీగ్‌ దశలో అత్యధిక విజయాల (20 పాయింట్లు)తో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. క్వాలిఫయర్‌-1లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైంది. డగౌట్‌లో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ వ్యూహాలు, మైదానంలో రిషబ్‌ పంత్‌ మెరుపులతో లీగ్‌ దశలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఢిల్లీ.. ధోనీ సేనతో పోరులో తేలిపోయింది. దుబాయ్‌లాంటి పిచ్‌పై మొదట బ్యాటింగ్‌ చేస్తూ భారీ స్కోరు చేయలేకపోయిన పంత్‌ సేన.. ఆనక బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. నోర్జే, రబడ తమ వేగంతో ప్రత్యర్థిని భయపెడుతున్నా నిలకడగా వికెట్లు తీయలేకపోతుండటంతో యువ పేసర్‌ అవేశ్‌ ఖాన్‌పైనే ఆ జట్టు ఎక్కువగా ఆధారపడుతున్నది. సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థాయికి తగ్గట్లు రాణించకపోవడం కూడా ఆజట్టును దెబ్బతీస్తున్నది. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన అశ్విన్‌ కేవలం 5 వికెట్లే పడగొట్టడం జట్టు యాజమాన్యాన్ని కలవర పెడుతున్నది. గాయంతో ఇబ్బంది పడుతున్న పేస్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ కోలుకుంటే టామ్‌ కరన్‌ స్థానంలో అతడికి తుది జట్టులో అవకాశం దక్కడం ఖాయమే. భారీ షాట్లతో మ్యాచ్‌ను ఫినిష్‌ చేయడంతో పాటు బౌలింగ్‌లో కీలక వికెట్లు పడగొట్టగల స్టొయినిస్‌ అందుబాటులోకి వస్తే ఢిల్లీ కష్టాలు తీరినట్లే. పృథ్వీషా గత మ్యాచ్‌లోనూ చక్కటి ప్రదర్శన కనబర్చగా.. ధవన్‌, పంత్‌, శ్రేయస్‌ సమిష్టిగా సత్తాచాటితే కోల్‌కతాను ఓడించడం పెద్ద కష్టం కాకపోవచ్చు!

స్పిన్‌ మాయాజాలం

తొలి ఐపీఎల్‌ టైటిల్‌ సాధించాలనుకున్న విరాట్‌ కోహ్లీ ఆశలపై నీళ్లు చల్లిన కోల్‌కతా.. ఎలిమినేటర్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఓడించి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. నరైన్‌, షకీబ్‌, వరుణ్‌ త్రయం గత మ్యాచ్‌లో 12 ఓవర్లు వేసి 65 పరుగులు ఇవ్వడంతోనే కోల్‌కతా మ్యాచ్‌ను తమ చేతుల్లోకి తెచ్చుకుంది. అదే పిచ్‌పై నేడు మ్యాచ్‌ జరుగనుండటం మోర్గాన్‌ సేనకు కలిసొచ్చే అంశం కాగా.. బ్యాటర్లు కూడా కలిసికట్టుగా రాణిస్తే కోల్‌కతాకు తిరుగుండదు. యూఏఈ వేదికగా ఈ సీజన్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో నెగ్గిన కోల్‌కతా.. ఆ పోరులో ప్రత్యర్థికి ఒక్క సిక్సర్‌ కూడా కొట్టనివ్వలేదంటే వాళ్ల బౌలింగ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే జోరు మరోసారి కనబర్చాలని నైట్‌రైడర్స్‌ యాజమాన్యం కోరుకుంటున్నది. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఫర్వాలేదనిపిస్తుండగా.. మరో ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ ఉత్తుంగ తరంగంలా దూసుకొచ్చాడు. పవర్‌ ప్లేలో భారీ షాట్లు ఆడగల ఈ ఎడమ చేతివాటం బ్యాటర్‌.. అవసరమైన సమయంలో తన మీడియం పేస్‌తోనూ జట్టుకు ఉపయోగ పడుతున్నాడు. నితీశ్‌ రాణా, రాహుల్‌ త్రిపాఠి లాంటి నాణ్యమైన ఆటగాళ్లు టాపార్డర్‌లో ఉండగా.. దినేశ్‌ కార్తీక్‌, మోర్గాన్‌ ఫినిషింగ్‌ బాధ్యతలు చూసుకుంటున్నారు. ప్రత్యర్థికి అంతుచిక్కని బంతులతో వీర విజృంభణ సాగిస్తున్న విండీస్‌ మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌.. అవసరమైతే ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగైనా విధ్వంసం సృష్టించేందుకు సిద్ధంగా ఉండటం కోల్‌కతాకు కలిసొచ్చే అంశం! డేంజర్‌ మ్యాన్‌ రస్సెల్‌ గాయం నుంచి కోలుకొని అందుబాటులోకి వచ్చినా.. పిచ్‌ స్పిన్నర్లకు సహకరించనుండటంతో షకీబ్‌కే తుది జట్టులో చాన్స్‌ దక్కే అవకాశాలున్నాయి!

తుది జట్లు (అంచనా)

ఢిల్లీ: పంత్‌ (కెప్టెన్‌), పృథ్వీషా, ధవన్‌, శ్రేయస్‌, హెట్‌మైర్‌, స్టొయినిస్‌/టామ్‌ కరన్‌, అక్షర్‌, అశ్విన్‌, రబడ, నోర్జే, అవేశ్‌.
కోల్‌కతా: మోర్గాన్‌ (కెప్టెన్‌), గిల్‌, వెంకటేశ్‌, త్రిపాఠి, రాణా, కార్తీక్‌, షకీబ్‌, నరైన్‌, ఫెర్గూసన్‌, వరుణ్‌, మావి.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement