David Warner : తీరిక లేని షెడ్యూల్, ఫ్రాంఛైజీలకు ఆడడం, జాతీయ జట్టుకు ఆడడం వల్ల తాను మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోయానని ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. సోమవారం జరగనున్న క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డు వేడులకు ముందు అతను ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వేసవిలో తీరిక లేని షెడ్యూల్ తనపై తీవ్ర ప్రభావం చూపిందని, తాను బాగా అలసిపోయానని వార్నర్ అన్నాడు. అదొక ఛాలెంజ్. నేను చాలా అలసిపోయాను. ఇంటి వద్ద మరొక రాత్రి విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది. కానీ పరిస్థితులను మార్చలేం. అంగీకరించాల్సిందే అని వార్నర్ వెల్లడించాడు. సఫారీలతో టెస్టు సిరీస్ తర్వాత ఈ స్టార్ ఓపెనర్ బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ తరఫున బరిలోకి దిగాడు.
ఆసీస్‌కు వార్నర్ కీలకం
వార్నర్ త్వరలోనే ఆసీస్ జట్టుతో భారత పర్యటనకు రానున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగిన టెస్టు సిరీస్‌లో వార్నర్ దుమ్మురేపాడు. వందో టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదాడు. ఇండియా సిరీస్‌లో అతను ఆసీస్‌కు కీలకం కానున్నాడు. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా, ఇండియా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనున్నాయి. ఇరుజట్ల మధ్య ఇదే చివరి బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ కావడం విశేషం. అంతేకాదు, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు దక్కించుకునేందుకు ఈ సిరీస్ భారత్ ముందున్న అతి పెద్ద సవాల్. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు ఫైనల్లో చోటు ఖాయం చేసుకుంది. మొదటి టెస్టు ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్ తర్వాత మూడు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లు తలపడతాయి.