David Warner : ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) అంతర్జాతీయ క్రికెట్లో ఒక శకాన్ని ముగించాడు. ఏకకాలంలో వన్డేలు, టెస్టులకు వీడ్కోలు పలికి బౌలర్లను ఊపిరితీసుకోనిచ్చాడు. ప్రపంచంలోని విధ్వంసక ఓపెనర్లలో ఒకడిగా పేరొందిన వార్నర్ కెరీర్ ఆసాంతం దూకుడే మంత్రగా ఆడాడు. ఆఖరి టెస్టులోనూ హాఫ్ సెంచరీతో ఫ్యాన్స్‌ను అలరించాడు. ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన వార్నర్ నాలుగు ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)లు అందుకున్నాడు. 2015 వరల్డ్ కప్, 2021లో టీ20 వరల్డ్ కప్, 2023లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్, 2023లో వన్డే ప్రపంచ కప్ గెలిచిన కంగారూ జట్టులో వార్నర్ సభ్యుడు. అయితే.. డేవిడ్ భాయ్ కెరీర్లో బాల్ ట్యాంపరింగ్ వివాదం మాత్రం మాయని మచ్చలా మిగిలిపోయింది.
వార్నర్ క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు వణుకే. బంతిని బలంగా బాదే అతడు అన్ని రకాల షాట్లు ఆడడంలో దిట్ట. స్కూప్ షాట్ల నుంచి ఇక సెంచరీ కొట్టాక అతడి విన్యాసం చూసేందుకు రెండు కళ్లు చాలవనుకో. గాల్లో జంప్ చేస్తూ సంబురాలు చేసుకుంటాడు.
చివరిసారిగా వార్నర్ వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో శతకం సాధించి తన స్టయిల్ సెలబ్రేషన్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు. ప్రపంచ క్రికెట్‌పై బలమైన ముద్ర వేసిన డేవిడ్ భాయ్ 15 ఏండ్ల వయసులో ఈస్టర్న్ సబ్హర్బ్స్ క్లబ్(Eastern Subhurbs Club)తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అనంతరం అండర్ -19 ఆస్ట్రేలియా టీమ్‌కు ఎంపికైన వార్నర్ శ్రీలంక పర్యటనలో దంచికొట్టాడు.
అండర్ -19 జట్టుతో 2005-06లో భారత పర్యటనకు వచ్చిన వార్నర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాదు అండర్ -19 ప్రపంచకప్‌లో అసీస్ జట్టుకు సారథిగా వ్యహరించాడు. నిలకడగా రాణిస్తున్న అతడికి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. 2009లో టీ20ల్లో అరంగేట్రం చేసిన వార్నర్ దక్షిణాఫ్రికాపై 43 బంతుల్లోనే 89 రన్స్ కొట్టాడు.
అండర్ -19 వరల్డ్ కప్ ట్రోఫీతో మాథ్యూస్, వార్నర్, కోహ్లీ
టీ20ల్లో సక్సెస్‌లో వన్డే జట్టులోకి వచ్చిన వార్డర్ సఫారీలపై హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే.. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ అనే కారణంతో వార్నర్ టెస్టు జట్టులో చోటుకోసం రెండేండ్లు నిరీక్షించాల్సి వచ్చింది. 2011లో న్యూజిలాండ్‌పై గబ్బాలో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన డేవిడ్ భాయ్ అనతి కాలంలోనే ఓపెనర్‌గా స్థిరపడిపోయాడు.
పాకిస్థాన్‌పై 2019లో అడిలైడ్‌లో జరిగిన టెస్టులో వార్నర్ వీరవిహారం చేశాడు. ట్రిపుల్ సెంచరీతో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (334 రన్స్) రికార్డును బద్ధలు కొట్టాడు. వన్డే తరహాలో పాక్ బౌలర్లను ఉతికారేసిన వార్నర్ 411 బంతుల్లో 39 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 335 రన్స్ కొట్టాడు.
ట్రిపుల్ సెంచరీ కొట్టాక వార్నర్ సింహనాదం
టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. 2015లో న్యూజిలాండ్‌పై వార్నర్ చెలరేగిపోయాడు. 286 బంతుల్లో 24 ఫోర్లు, 2 సిక్సర్లతో 253 రన్స్ బాది జట్టును గట్టెక్కించాడు. మరో విషయం ఏంటంటే.. అతడు రికార్డు స్థాయిలో పాకిస్థాన్‌పై ఆరు శతకాలు బాదాడు.
ఆస్ట్రేలియా జట్టు 2018 మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్ సమయంలో కామెరూన్ బ్యాన్‌క్రాఫ్ట్(Cameron Bancraft) సాండ్‌పేపర్(Sand Paper)తో బంతిని రుద్దుతూ కెమెరా కంట పడ్డాడు. అతడిపై విచారణ జరపగా.. బాల్ ట్యాంపరింగ్‌లో వార్నర్ హస్తం ఉందని తేలింది. దాంతో, ఆసీస్ ఆటగాళ్లపై మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
వార్నర్, స్టీవ్ స్మిత్
ఆ సంఘటనను సీరియస్‌గా తీసుకున్నబాల్ ట్యాంపరింగ్‌తో సంబంధం ఉన్న వార్నర్, స్టీవ్ స్మిత్(Steven Smith), బ్యాండ్క్రాఫ్ట్పై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. వార్నర్‌ను ఏడాది పాటు సస్పెండ్ చేయడమే కాకుండా కెప్టెన్సీ చేపట్టకుండా ఆంక్షలు విధించింది.
కెరీర్లో 161 వన్డేలు ఆడిన వార్నర్ 6,932 పరుగులు సాధించాడు. 97.26 స్ట్రైక్ రేటుతో 22 సెంచరీలు బాదాడు. దాంతో, ఆసీస్ తరఫున అత్యధిక శతకాలు బాదిన రెండో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(Ricky Ponting) 29 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
వార్నర్, రికీ పాంటింగ్
ఆస్ట్రేలియా గొప్ప క్రికెటర్లలో ఒకడైన వార్నర్ 112 టెస్టుల్లో 44.59 సగుటతో 8,786 పరుగులు సాధించాడు. 26 శతకాలు, 37 హాఫ్ సెంచరీలు అతడి ఖాతాలో ఉన్నాయి. మరో విషయం ఏంటంటే.. కెరీర్లో చివరి వన్డేలో ప్రపంచ చాంపియన్‌గా, చివరి టెస్టులో విజేతగా నిలవడం వార్నర్‌కే సాధ్యమైంది.