David Warner: ఇటీవలే టెస్టులతో పాటు వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్‌పై ఆస్ట్రేలియా మాజీ కోచ్ జాన్ బుకానన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడేం గొప్ప క్రికెటర్ కాదని, అసలు ‘గ్రేట్’ అనేంత స్థాయిలో వార్నర్ చేసిందేమీ లేదని బుకాకన్ వ్యాఖ్యానించాడు. డాన్ బ్రాడ్‌మన్, గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్ లతో పోల్చితే వార్నర్ సాధించిందేముందని బుకానన్ ప్రశ్నించాడు. వార్నర్ ‘గ్రేట్ క్రికెటర్’ కాదా..? అని అడిగిన ప్రశ్నకు బుకానన్.. ‘నేనైతే అలా అనుకోవడం లేదు’ అని చెప్పుకొచ్చాడు.
ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుకానన్ మాట్లాడుతూ… ‘అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో వార్నర్ అద్భుతంగా ఆడాడు. టెస్టులలో అతడి ఖాతాలో 8 వేలకు పైగా పరుగులున్నాయి. వంద టెస్టులు, 160 వన్డేలు, వందకు పైగా టీ20లు ఆడి తనదైన ముద్రవేశాడు. అతడి బ్యాటింగ్ సగటు కూడా మెరుగ్గా ఉంది. యావరేజ్‌తో పాటు స్ట్రైక్ రేట్ కూడా బాగుంది. ప్రదర్శనలపరంగా చూస్తే వార్నర్ ఇతర క్రికెటర్ల కంటే మెరుగ్గా ఆడాడు…
కానీ, క్రికెట్లో ‘గ్రేట్’ అనిపించుకునేంత గొప్పగా వార్నర్ ఏమీ చేయలేదని నా అభిప్రాయం. గ్రేట్ అనిపించుకోవాలంటే క్రికెట్లో మరెవరూ అతడు సాధించిన రికార్డుల దరిదాపుల్లోకి రాకూడదు. ఆ జాబితాలో చూసుకుంటే ఆసీస్ నుంచి డాన్ బ్రాడ్‌మన్, గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్‌లు మాత్రమే గ్రేట్ అని నా అభిప్రాయం. కచ్చితంగా వార్నర్ అయితే ఆ కేటగిరీలో లేడు..’ అని అన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో వార్నర్.. 112 టెస్టులాడి 8,786 పరుగులు చేశాడు. 161 వన్డేలలో 6,932 రన్స్ సాధించిన అతడు.. 99 టీ20లలో 2,894 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా క్రికెట్లో పరుగుల పరంగా అత్యధిక రన్స్ చేసిన క్రికెట్ (మూడు ఫార్మాట్లు)లో రికీ పాంటింగ్ (27,368) తర్వాత డేవిడ్ వార్నర్ (18,612) ఉన్నాడు. స్టీవ్ వా (18,496), అలెన్ బోర్డర్ (17,698) వంటి దిగ్గజాలు కూడా వార్నర్ కిందే ఉండటం గమనార్హం.