భారత్‌తో రెండో వన్డేకు సిద్ధం అవుతున్న సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌కు విషాద వార్త అందింది. అతని సూపర్ ఫ్యాన్, స్నేహితుడి కుమార్తె అనె కన్నుమూసింది. శనివారం నాడు అనె కన్నుమూసిన వార్త మిల్లర్‌కు తెలిసింది. సౌతాఫ్రికా ఆడిన ఎన్నో మ్యాచులు చూసేందుకు వచ్చిన అనె.. ఆట ముగిసిన తర్వాత అనేకసార్లు మిల్లర్‌తో ఫొటోలు దిగింది.
చాలా కాలంగా కేన్సర్‌తో పోరాడుతున్న ఈ పాప చనిపోయిన వార్త తెలిసిన మిల్లర్.. ఇన్‌స్టాలో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పోస్టు పెట్టాడు. ఇది చూసిన చాలా మంది నెటిజన్లు ఆ పాప.. మిల్లర్ కుమార్తె అనుకున్నారు. అయితే ఆమె మిల్లర్ కుమార్తె కాదు. అతని స్నేహితుడి కుమార్తె. అనె మరణంపై స్పందించిన మిల్లర్..
‘నిన్ను చాలా మిస్ అవుతాను. నాకు తెలిసిన వారిలో అందరికన్నా పెద్ద గుండె నీది. పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన గొప్పదానివి. ఎంత కష్టం ఉన్నా నీ మొఖంలో చిరునవ్వు ఎప్పుడూ చెదిరిపోలేదు. నీలో ఉన్న ఆ తుంటరి, అల్లరితనం కూడా మర్చిపోలేను. నీ దారిలో కనిపించిన ప్రతి వ్యక్తిని, ప్రతి సవాలును నువ్వు గుండెలకు హత్తుకున్నావు. జీవితంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలని నాకు నేర్పించావు. నీతో కలిసి ప్రయాణించినందుకు చాలా గౌరవంగా ఉంది. ఐ లవ్ యూ సో మచ్’ అని పోస్టు చేశాడు.