రాయ్‌పూర్: మావోయిస్టు ప్రాబల్యంతో నిరంతరం ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉండే దంతెవాడలో మార్పులకు అడుగులు పడుతున్నాయి. ఇన్నాళ్లు అభివృద్ధికి దూరంగా ఉన్న గిరిజనవాసులను జనజీవన స్రవంతిలో తీసుకొచ్చేందుకు ప్రభుత్వంతో పాటు పలు స్వచ్చంద సంస్థలు ముందుకొస్తున్నాయి. ‘మైదాన్ కప్’ కార్యక్రమంలో భాగంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బుధవారం మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన దంతెవాడలో పర్యటించాడు. జగ్దల్పూర్ ఎయిర్పోర్ట్ నుంచి దంతెవాడలోని చిందార్ గ్రామానికి వచ్చిన లిటిల్ మాస్టర్ పలు కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సచిన్ మీడియాతో మాట్లాడుతూ ‘మైదాన్ కప్‌లో భాగంగా చత్తీస్‌గఢ్‌లో మన్ దేశీతో కలిసి క్రీడాభివృద్ధికి పలు ప్రణాళికలు రచించాం. రాష్ట్రవ్యాప్తంగా 50 పాఠశాలల్లో క్రీడా మైదానాలను అభివృద్ధి చేయనున్నాం. ఈ ప్రాంత గత చరిత్రను తిరుగరాస్తూ కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. క్రీడా ఈవెంట్లో భాగంగా పిల్లలతో కలిసి ఆడటం చాలా సంతోషంగా ఉంది. దాదాపు ప్రతీ పాఠశాలలో కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, వాలీబాల్‌ను అభివృద్ధి చేస్తాం. తొలి దశలో ప్రభుత్వ పాఠశాలల్లో తక్కువ ఖర్చుతో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం. మొత్తం 13 క్రీడాంశాలకు ఇందులో చోటు కల్పిస్తాం’ అని తెలిపాడు.