నాగ్‌పూర్: కేరళతో నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో తొలిరోజు విదర్భను ఆ జట్టు యువ బ్యాటర్ డానిష్ మలేవర్ (259 బంతుల్లో 138 నాటౌట్, 14 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో ఆదుకున్నాడు. డానిష్‌తో పాటు సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (86) రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి విదర్భ 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.
ఒకదశలో 24 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన ఆ జట్టును డానిష్, కరుణ్ పోరాటం నిలబెట్టింది. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 215 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యం గా 21 ఏండ్ల డానిష్.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కరుణ్ నాయర్‌తో మూడు సెషన్ల పాటు కేరళ బౌలర్లను దీటుగా ఎదుర్కున్నాడు.
అతడికి ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఇది రెండో శతకం కావడం విశేషం. ఆట ముగిసే సమయానికి డానిష్‌తో పాటు యశ్ ఠాకూర్ (5 నాటౌట్) క్రీజులో ఉన్నారు. కేరళ బౌలర్లు ఆరంభంలోనే మ్యాచ్‌పై చిక్కిన పట్టును కొనసాగించలేకపోయారు.