బ్రిస్బేన్: ప్రతిష్ఠాత్మక యాషెస్ ఆరంభం రోజే ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా…ఇంగ్లండ్‌కు ఝలక్ ఇచ్చింది. గబ్బా వేదికగా బుధవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ బృందాన్ని 147 పరుగులకే కంగారూ బౌలర్లు కుప్పకూల్చారు. తొలి బంతికే ఓపెనర్ రోరీ బర్న్స్ (0)ను మిచెల్ స్టార్క్(2/35)బౌల్డ్ చేసి షాకిచ్చాడు. అనంతరం మలాన్ (6), కెప్టెన్ రూట్ (0)ను హాజిల్‌వుడ్(2/42) ఔట్ చేయడంతో 11 పరుగులకే ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు టాపార్డర్ పెవిలియన్ బాట పట్టగా.. మిడిలార్డర్లో జోస్ బట్లర్ (39), పోప్ (35) నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. కెప్టెన్‌గా బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే కమిన్స్ (5/38) ఐదు వికెట్లతో విజృంభించాడు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ కమిన్స్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను కకావికలు చేశాడు. తన సూపర్ స్వింగ్‌తో లోయార్డర్‌ను దెబ్బతీసి 150 పరుగుల లోపే ఇంగ్లిష్ జట్టును కుప్పకూల్చడంలో కీలకమయ్యాడు. వర్షం కారణంగా వెలుతురు సరిగ్గా లేకపోవడంతో తొలి రోజు ఆటను తొందరగానే ముగించారు.