e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home స్పోర్ట్స్ చెన్నై X ముంబై

చెన్నై X ముంబై

  • నేడు ఐపీఎల్‌ 14వ సీజన్‌ పునఃప్రారంభం
  • తొలి పోరులో రోహిత్‌, ధోనీ అమీతుమీ
  • రాత్రి 7.30 నుంచి..

కరోనా మహమ్మారి కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. పొట్టి ప్రపంచకప్‌నకు ముందు.. ట్రైలర్‌లా సాగనున్న ఈ ధనాధన్‌ టోర్నీలో మెరువాలని ఆటగాళ్లంతా తహతహలాడుతుంటే.. ఎలాంటి అవాంతరాలు రాకుండా బీసీసీఐ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. మాజీ చాంపియన్‌లు చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య పోరుతో రెండో దశకు తెరలేవనుండగా.. గత కొన్నాళ్లుగా టెస్టు క్రికెట్‌ను ఆస్వాదించిన అభిమానులు.. ఇకపై పరుగుల మోతలో తడిసి ముద్దవనున్నారు!

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 14వ సీజన్‌ రెండో దశకు వేళైంది. టీ20 ప్రపంచకప్‌నకు ముందు పరుగుల పండుగ చేసుకునేందుకు జట్లన్నీ సిద్ధం కాగా.. మాజీ చాంపియన్‌లు ముంబై, చెన్నై ఆదివారం బరిలోకి దిగనున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది వేసవిలోనే ఐపీఎల్‌ జరుగాల్సి ఉన్నా.. 29 మ్యాచ్‌లు ముగిశాక కరోనా వైరస్‌ కేసులు వెలుగు చూడటంతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో టోర్నీ నిర్వహణపై మల్లగుల్లాలు పడ్డ బీసీసీఐ.. ఎట్టకేలకు యూఏఈలో కఠినమైన బయో బబుల్‌ మధ్య మిగిలిన 31 మ్యాచ్‌లను నిర్వహించాలని నిర్ణయించింది. వచ్చే నెలలో ఇక్కడే టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కావాల్సి ఉండగా.. దానికంటే ముందు అభిమానులకు విందు భోజనం వడ్డించేందుకు ఈ లీగ్‌ సిద్ధమైంది. ఇప్పటికే జట్లన్నీ యూఏఈ చేరుకోగా.. క్వారంటైన్‌ ముగించుకున్న ఆటగాళ్లు ప్రాక్టీస్‌ ప్రారంభించారు. పరిమిత సంఖ్యలో అభిమానులను అనుమతించనున్న ఈ టోర్నీలో మెరిసి.. పొట్టి ప్రపంచకప్‌నకు ముందు ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవాలని ప్లేయర్లు భావిస్తుంటే.. ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించి అదే జోరులో వరల్డ్‌కప్‌నకు ఆతిథ్యమివ్వాలని బీసీసీఐ యోచిస్తున్నది.

రోహిత్‌ మెరిసేనా..

- Advertisement -

పొట్టి ప్రపంచకప్‌ అనంతరం విరాట్‌ కోహ్లీ టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించడంతో.. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మపైనే అందరి దృష్టి నిలువనుంది. సహజంగా ఐపీఎల్‌లో నెమ్మదిగా ఆరంభించి చివరికొస్తున్నా కొద్ది మెరుగైన ప్రదర్శన కనబర్చే ముంబై ఇండియన్స్‌ ప్రస్తుతం లీగ్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 4 విజయాలతో నాలుగో స్థానంలో ఉండగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఏడింట ఐదు నెగ్గి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ముంబైకి రోహిత్‌, సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, పాండ్యా బ్రదర్స్‌, బుమ్రా, బౌల్ట్‌ కీలకం కానుండగా.. ధోనీ సేన మాత్రం సీనియర్లపైనే ఆశలు పెట్టుకుంది. చాన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్న ధోనీ, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, ఇమ్రాన్‌ తాహిర్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ అందుబాటులో లేకపోవడం చెన్నైకి దెబ్బ కాగా.. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌పై ఆ జట్టు చాలా ఆశలు పెట్టుకుంది. టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు ముంబై పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో మెరువాలని భారత అభిమానులు ఆశిస్తుంటే.. సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ చాహర్‌ తమ ఎంపికకు న్యాయం చేయాలని ఉత్సుకతతో ఉన్నారు. మరి దుబాయ్‌ వేదికగా జరుగనున్న పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి!

తుది జట్లు (అంచనా)

చెన్నై: ధోనీ (కెప్టెన్‌), గైక్వాడ్‌, అంబటి రాయుడు, అలీ, రైనా, జడేజా, బ్రేవో, శార్దూల్‌, దీపక్‌ చాహర్‌, తాహిర్‌, ఎంగ్డీ.
ముంబై: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), డికాక్‌, సూర్యకుమార్‌, ఇషాన్‌, పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌, మిల్నే, రాహుల్‌ చాహర్‌, బౌల్ట్‌, బుమ్రా.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement