IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్ ఆఖరి అంకానికి చేరింది. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన రెండు జట్లు టైటిల్ పోరులో తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఈ ఏడాది రికార్డు స్కోర్లతో ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మూడో ఫైనల్లో అడుగుపెట్టింది. ఉత్కంఠ రేపిన క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)పై సంచలన విజయంతో రెండో టైటిల్ వేటకు సిద్ధమైంది.
తొలిసారి 2016లో టైటిల్ పోరుకు దూసుకెళ్లిన ఆరెంజ్ ఆర్మీ చాంపియన్‌గా అవతరించింది. అనంతరం 2018లోనూ ఫైనల్ చేరినా చెన్నై సూపర్ కింగ్స్ ధాటికి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ఫైనల్ ఆడిన ఆల్‌టైమ్ రికార్డు మాత్రం సీఎస్కేదే. ఆ జట్టు ఏకంగా పది పర్యాయాలు టైటిల్ వేటలో నిలవడమే కాకుండా ఐదు ట్రోఫీలు కొల్లగొట్టింది.
సీఎస్కే తర్వాత ఎక్కువ ఫైనల్స్ ఆడిన రికార్డు ముంబై ఇండియన్స్(Mumbai Indians) పేరిట ఉంది. ఆరుసార్లు టైటిల్ ఫైట్‌లో తలపడిన ముంబై ఏకంగా ఐదు ట్రోఫీలు ఎగరేసుకుపోయింది. ఇక ప్రస్తుత ఫైనలిస్ట్ కోల్‌కతా నైట్ రైడర్స్ విషయానికొస్తే.. ఇది ఆ జట్టుకు నాలుగో ఫైనల్.
గతంలో గౌతం గంభీర్ (Gautam Gamhbir) సారథ్యంలో కోల్‌కతా రెండు సార్లు (2012, 2014) చాంపియన్‌గా నిలిచింది. 2021లో కేకేఆర్ పోరాడినా చివరకు చెన్నై గెలుపొందడంతో ట్రోఫీ చేజార్చుకుంది. ఇక.. సన్‌రైజర్స్‌తో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) మూడో స్థానంలో కొనసాగుతోంది. 2009, 2011, 2016లో ఆర్సీబీ టైటల్ పోరుకు దూసుకెళ్లినా కప్పు మాత్రం కొట్టలేకపోయింది.