రియాద్: ఆధునిక సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన పేరిట మరో ఘనతను లిఖించుకున్నాడు. సౌదీ ప్రో లీగ్‌లో అల్ నసర్ తరఫున ఆడుతున్న ఈ పోర్చుగల్ వీరుడు.. ఫైనల్లో అల్ హిలాల్‌పై ఒక గోల్ చేయడంతో సీజన్లో అతడి మొత్తం గోల్స్ సంఖ్య 35కు చేరింది. దీంతో ఒక సీజన్లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా రొనాల్డో రికార్డులకెక్కాడు.
గతంలో ఈ రికార్డు హమ్దల్లా (2019 సీజన్లో 34 గోల్స్) పేరిట ఉండేది. లీగ్స్‌లో ఆడుతూ అత్యధిక గోల్స్ చేసిన రికార్డు (893) రొనాల్డోదే. కానీ అతడు రికార్డు గోల్స్ చేసినా సౌదీ ప్రో లీగ్‌లో అల్ నసర్ మాత్రం రెండో స్థానంలో నిలిచింది. సీజన్ ఆసాంతం ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఆడిన అల్ హిలాల్ విజేతగా నిలిచింది.