ముంబై: భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వివాదాస్పద రీతిలో వార్తల్లోకెక్కాడు. భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అసందర్భ ట్వీట్ చేశాడు. మహాత్మా గాంధీ మాటలను ఉదహరిస్తూ ‘కన్నుకు కన్ను సమాధానమైతే ప్రపంచం గుడ్డిది అవుతుంది’అని రాయుడు తన ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై తీవ్ర స్థాయిలో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ‘అందుకే సెలెక్టర్లు నీపై శీతకన్ను వేస్తూ వన్డే ప్రపంచకప్‌నకు ఎంపిక చేయలేదు’ అంటూ ఒక నెటిజన్ ఘాటుగా స్పందించాడు.
అన్ని వైపులా నెటిజన్లు రాయుడుపై ఘాటైన ట్వీట్లు చేయడంతో వెంటనే సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాడు. ‘భారత సరిహద్దు రాష్ర్టాలైన జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లో శాంతి నెలకొనాలని ఆశిస్తున్నా. పాక్ దాడులతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు త్వరలో కోలుకోవాలి. జైహింద్’ అంటూ రాయుడు మరో ట్వీట్ చేసి వివాదాన్ని సద్దుమణిగించే పనిలో పడ్డాడు.