ముంబై: నాలుగేండ్లకోసారి జరిగే ప్రతిష్ఠాత్మక ఒలిపింక్స్‌లో ఎన్నో ఆటలు ఉన్నా.. ఎందరో గొప్ప క్రీడాకారులు రికార్డులు బద్ధలు కొట్టి చరిత్ర సృష్టించినా.. ప్రపంచలోనే అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన క్రికెట్ లేకపోవడం మాత్రం క్రీడాభిమానులకు పెద్ద లోటు అనిపించేది. డాన్ బ్రాడ్‌మన్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజ క్రికెటర్ల బ్యాటింగ్ విన్యాసాలు.. కపిల్ దేవ్, ఇయాన్ బోథాం వంటి ఆల్‌రౌండర్ల ప్రతాపాన్ని విశ్వ వేదికపై చూడలేకపోతున్నామనే వెలితి కోట్లాదిమంది గుండెల్ని పిండేసేది.
అందుకనే కాబోలూ ప్రతి ఏడాది క్రికెట్‌ను విశ్వక్రీడల్లో భాగం చేయాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపించేవి. ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ కలను సాకారం చేస్తూ.. 123 ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం క్రికెట్ ఆటను మళ్లీ విశ్వ క్రీడల్లో భాగం చేసింది. అది కూడా క్రికెట్ స్వరూపాన్నే మార్చేసిన టీ20 ఫార్మాట్లో నిర్వహించనుండడంతో క్రీడాభిమానులు సంతోషంతో పొంగిపోతున్నారు. ఘన చరిత్ర కలిగిన ఒలిపింక్స్‌లో తమ ఆరాధ్య ఆటగాళ్ల ప్రదర్శనను తిలకించే రోజు కోసం ఆతృతగా కోట్లాది కండ్లతో ఎదురుచూస్తున్నారు.
ప్యారిస్ వేదికగా 1900 ఒలిపింక్స్‌లో తొలిసారి క్రికెట్ పోటీలు నిర్వహించారు. అప్పుడు ఇంగ్లండ్ జట్టు ఫ్రాన్స్‌ను ఓడించి స్వర్ణం పతకం సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ మెగా ఈవెంట్లో క్రికెట్ పునరాగమనానికి ఏకంగా ఒక శతాబ్ద్ధ కాలం వేచి చూడాల్సి వచ్చింది. 123 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్ పోటీలో క్రికెట్‌కు మళ్లీ చోటు కల్పించాలనే తీర్మానానికి సోమవారం ఐఓసీ ఆమోద ముద్ర వేసింది.
ముంబైలో జరిగిన ఐఓసీ 141వ సెషన్లో.. 2028లో లాస్ఏంజెల్స్లో జరిగే విశ్వ క్రీడల్లో క్రికెట్‌ను భాగం చేయాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో విశ్వ వేదికపై క్రికెట్ ఆట చూడాలని ఆశపడిన కోట్లాది మంది అభిమానుల నిరీక్షణ ఫలించింది. క్రికెట్‌తో పాటు బేస్‌బాల్-సాఫ్ట్‌బాల్, స్కాష్, లాక్రొస్సే, ఫ్లాగ్ ఫుట్‌బాల్ ఆటల ప్రవేశానికి కూడా ఐఓసీ బృందం ఆమోదం తెలిపింది.