ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడలకు తెరలేచింది. బర్మింగ్‌హామ్ వేదికగా.. గురువారం రాత్రి అట్టహాసంగా ప్రారంభ వేడుకలు జరుగగా.. 72 సభ్య దేశాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ సింధు త్రివర్ణ పతకాన్ని చేతబూని ముందు నడువగా.. ఆ వెనుకే భారత బృందం వేదికపైకి వచ్చింది. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ క్రీడలు ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించగా.. శుక్రవారం నుంచి అథ్లెట్లు పతకాల కోసం పోటీ పడనున్నారు.
బర్మింగ్‌హామ్: ముచ్చటగా మూడోసారి ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తున్న కామన్వెల్త్ క్రీడలకు తెరలేచింది. గురువారం అలెగ్జాండర్ స్టేడియంలో కన్నుల పండువగా జరిగిన ప్రారంభ వేడుకల్లో బ్రిటన్ సంప్రదాయ కళారీతులు ఆహుతులను కట్టిపడేశాయి. అందరికంటే ముందు మైదానంలోకి క్రీడల మస్కట్ ‘పెర్రీ’ ఎంట్రీ ఇవ్వగా.. ఆ తర్వాత సంప్రదాయ నృత్యాలతో స్టేడియం మార్మోగిపోయింది. ప్రముఖ కంపెనీలకు చెందిన 72 కార్లు దూసుకురాగా.. వాటి వెనకే బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ వేదికపై వచ్చారు.
అనంతరం ఆధునిక సాంకేతికతను ఉపయోగించి నిర్వహించిన షో చూపరులను ఆకట్టుకోగా.. నోబల్ ప్రైజ్ విజేత మలాలా యూసుఫ్‌జాహి కామన్వెల్త్ క్రీడల గొప్పతనాన్ని వివరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కామన్వెల్త్ దేశాలన్నింట్లో ప్రతి చిన్నారి పాఠశాలకు వెళ్లాలని.. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు దక్కాలని ఆకాంక్షిస్తూ.. అథ్లెట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పింది. కరోనా కష్టకాలంలోనూ నిర్వహాకులు అద్వితీయమైన ఏర్పాట్లు చేయగా.. రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎరోబాటిక్ బృందం ఆకాశంలో హరివిల్లులు సృష్టించింది.
నిఖత్, లవ్లీనాకు సులువైన డ్రా
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గోహైకు సులువైన డ్రా దక్కింది. ఆదివారం జరిగే మహిళల 48-50 కిలోల లైట్ ఫ్లైట్ వెయిట్ విభాగంలో నిఖత్ జరీన్ తన తొలి పోరులో హెలెనా ఇస్మాయిల్బగావో(మొజాంబిక్)తో తలపడుతుంది. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ బోణీ కొడితే.. తదుపరి క్వార్టర్స్ బౌట్లో హెలెన్ జోన్స్(వేల్స్)తో నిఖత్ తలపడాల్సి వస్తుంది. మరోవైపు 66-70 కిలోల మిడిల్ వెయిట్ విభాగంలో లవ్లీనా బొర్గోహై..న్యూజిలాండ్ బాక్సర్ అరియానె నికోల్సన్ను ఎదుర్కొంటుంది. ఇందులో గెలిస్తే.. క్వార్టర్స్‌లో గోల్డ్‌కోస్ట్(2018) రజత విజేత రోసీ ఎకల్స్(వేల్స్)తో అమీతుమీ తేల్చుకోవాలి. జాస్మైన్కు తొలి రౌండ్లో బై లభించగా, నేరుగా క్వార్టర్స్ పోరులోకి ప్రవేశించింది. పురుషుల విభాగంలో రాష్ట్ర యువ బాక్సర్ ముసాముద్దీన్.. అమ్జోలె దెయితో తలపడుతాడు.