హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశ క్రీడారంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని క్రీడాశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన భేటీలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీపై ఆయన వారితో చర్చించారు. ‘యంగ్‌ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో ప్రతి క్రీడకు ప్రాధాన్యం ఉండాలి. అన్ని రకాల క్రీడలు, శిక్షణా సంస్థలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలి.
మన దేశంతో పాటు తెలంణాలో భౌగోళిక పరిస్థితుల ఆధారంగా శరీర నిర్మాణ తీరుకు అనుగుణంగా వారిని గుర్తించి ఆయా క్రీడల్లో ప్రోత్సహించాలి. ఒలింపిక్స్‌లో దేశం తరఫున పతకాలు సాధించే విధంగా వారిని తీర్చిదిద్దాలి. ఇందుకోసం నిపుణులైన కోచ్‌లతో శిక్షణ ఇప్పించాలి’ అని అన్నారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో క్రీడా విభాగాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్రీడా పాఠశాలలు, శిక్షణా సంస్థలన్నింటినీ స్పోర్ట్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని సీఎం సూచించారు. ఇటీవల పతకాలు సాధించిన ఆయా దేశాల ప్లేయర్లు, వారి నైపుణ్య శిక్షణపై సమగ్ర అధ్యాయనం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.