Sports Policy | హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ క్రీడా విధానానికి(స్పోర్ట్స్ పాలసీ) సంబంధించిన తుది ముసాయిదాను నవంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమ పాలసీని రూపొందించాలన్నారు. ఇందుకోసం విస్ర్తుత అధ్యయనం, నిఫుణులు, క్రీడాకారులతో సంప్రదింపులు జరుపాలని సూచించారు. శుక్రవారం స్పోర్ట్స్ పాలసీపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం పలు కీలక సూచనలు చేశారు.
‘రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వాడుకోవాలి. ఇప్పటికే ఉన్న స్టేడియాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మార్చాలి. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు ముసాయిదా వీలైనంత త్వరగా రూపొందించాలి. స్పోర్ట్స్ పాలసీలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ, సాట్స్ కలిసి సంయుక్తంగా పనిచేయాలి.
దక్షిణకొరియాతో పాటు ఆస్ట్రేలియాలోని క్వీన్‌ల్యాండ్ యూనివర్సిటీలో అనుసరిస్తున్న విధానాలను పరిశీలనలోకి తీసుకోవాలి. వచ్చే రెండేండ్లలో తెలంగాణలో జాతీయ గేమ్స్ జరిగేలా ఇప్పటి నుంచే అధికారులు ప్రణాళికలు తయారుచేయాలి’ అని అన్నారు. ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సలహాదారు కేశవరావు, జితేంతర్‌రెడ్డి, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, క్రీడాశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ పాల్గొన్నారు.