హైదరాబాద్, ఆట ప్రతినిధి: ‘ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు..యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు..స్టేడియాల్లో క్రీడాటోర్నీలు తప్పా మిగతా కార్యక్రమాలకు అనుమతివ్వం’. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వల్లె వేస్తున్న మాటలివి. కానీ.. స్వయాన సీఎం చెప్పుతున్నది ఒకటైతే వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియాన్ని ఇప్పటికే పూర్తిగా ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మార్చిన ప్రభుత్వం..తాజాగా గచ్చిబౌలి స్టేడియాన్ని ప్రైవేట్ ఈవెంట్లకు అడ్డాగా మార్చేందుకు అడుగులు వేస్తున్నది. ఈ మధ్యే దాదాపు రూ.20 కోట్లు పెట్టి గచ్చిబౌలి ఫుట్‌బాల్ స్టేడియానికి రంగులద్దిన ప్రభుత్వం..ఇప్పుడు సంగీత విభావరి కార్యక్రమానికి పచ్చజెండా ఊపింది. టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ‘రాక్‌స్టార్ డీఎస్పీ’ పేరిట హైదరాబాద్‌లో లైవ్ కన్సర్ట్ను ఈనెల 19న అట్టహాసంగా నిర్వహించబోతున్నారు.
ఇందుకోసం ఇప్పటికే గచ్చిబౌలి ఫుట్‌బాల్ స్టేడియంలో పనులు హడావుడిగా జరుగుతున్నాయి. అథ్లెట్లు ప్రాక్టీస్ చేసే సింథటిక్ ట్రాక్‌పైనే స్టేజి నిర్మాణం చేస్తున్నారు. ఇందుకు పెద్ద పెద్ద గుంతలు తవ్వుతున్నారు. ఇది వరకే ఆధ్వానస్థితిలో ఉన్న ట్రాక్‌పై ఇలాంటి నిర్మాణాలు చేయడంతో పూర్తిగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని అథ్లెట్లు ఓవైపు ఆందోళన చెందుతున్నారు. క్రీడాటోర్నీలు జరుగాల్సిన స్టేడియంలో సంగీత కార్యక్రమాలు ఏంటని క్రీడాభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యే ‘సీఎం కప్’ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటాలను ఈ సందర్భంగా గుర్తుకు తెస్తున్నారు. చెప్పేదొకటైతే.. చేసేదొకటా అన్న రీతిలో రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరును విమర్శిస్తున్నారు. నగరంలో ఇప్పటికే డీజేలపై నిషేధం కొనసాగుతున్న వేళ..దీనికి ఎలా అనుమతిచ్చారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే దేవీశ్రీప్రసాద్ బుధవారం స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ఇందులో కొసమెరుపు.