Chris Gayle : వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్(Chris Gayle) అంతర్జాతీయ క్రికెట్లో ఓ సంచలనం. అతడు క్రీజులోకి వచ్చాడంటే బౌలర్లు వణికిపోయేవాళ్లు. దంచడమే డ్యూటీగా భావించే ఈ డాషింగ్ బ్యాటర్ నెలకొల్పిన రికార్డులు కోకొల్లలు. ఆటకు వీడ్కోలు పలికిన ఈ లెజెండరీ క్రికెటర్ తాజాగా వైరల్ వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచాడు. తమదేశంలోని ఒక గ్యాస్ స్టేషన్లో వాహనదారులకు ఉచితంగా గ్యాస్ కొట్టించాడు. పోర్ట్‌మోర్ గ్యాస్ స్టేషన్(Portmore Gas Station)లో గేల్ అక్కడికి వచ్చిన బండ్లకు గ్యాస్ కొట్టించి డబ్బులు తనే చెల్లించాడు.
అంతేకాదు వాళ్లతో గేల్ సెల్ఫీలు కూడా దిగాడు. లెజెండరీ క్రికెటర్ తమతో అంత కలివిడిగా ఉండడం చూసి వాహనదారులు మస్త్ మురిసిపోయారు. ది ట్రాపిక్స్ అనే ఎక్స్ ఖాతాలో ఈ వీడియో పెట్టారు. ఒకప్పుడు బౌలర్ల భరతం పట్టిన గేల్ పెద్ద మనసు చాటుతున్న ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన ఫ్యాన్స్ యూనివర్సల్ బాస్ ఔదార్యానికి ఫిదా అవుతున్నారు.
Chris Gayle paying for everyone’s gas last night at a gas station in Portmore 🤯⛽️ pic.twitter.com/fFT2KSCjcS
— The Tropixs (@Tropixsofficial) January 15, 2024
జమైకాకు చెందిన గేల్ 1999లో క్రికెట్లో అరంగేట్రం చేశాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో అనతికాలంలోనే డేంజరస్ బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించాడు. విండీస్ జట్టు 2004లో చాంపియన్స్ ట్రోఫీ, 2012, 2016లో టీ20 వరల్డ్ కప్ చాంపియన్‌గా నిలవడంలో గేల్ కీలక పాత్ర పోషించాడు.
మొత్తంగా కెరీర్లో 19,593 రన్స్ కొట్టిన ఈ కరీబియన్ వీరుడి ఖాతాలో 147 హాఫ్ సెంచరీలు, 42 సెంచరీలు ఉన్నాయి. స్లిప్‌లో మెరుపు ఫీల్డర్‌గా పేరొందిన గేల్ 240 క్యాచ్‌లు పట్టాడు. ఈ సిక్సర్ల కింగ్ టెస్టుల్లో 331, వన్డేల్లో 98 సార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. ఆడినంత కాలం తన మార్క్ ఇన్నింగ్స్‌లతో ఫ్యాన్స్‌ను అలరించిన గేల్ 2019లో 50 ఓవర్ల ఫార్మాట్‌కు, 2021లో టీ20లకు వీడ్కోలు పలికాడు. 2022లో ఈ స్టార్ క్రికెటర్ ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెప్పేశాడు.