చాంగ్జౌ: భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం ఉన్నతి హుడా తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనను నమోదుచేసింది. చైనా ఓపెన్‌లో 17 ఏండ్ల ఈ అమ్మాయి.. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, స్టార్ షట్లర్ పీవీ సింధుకు షాకిచ్చింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఉన్నతి.. 21-16, 19-21, 21-13తో తన (35) కంటే మెరుగైన ర్యాంకు కలిగిన సింధు (15)ను ఓడించి క్వార్టర్స్ చేరింది.
ఇక ఈ విజయంతో ఉన్నతి.. చైనా ఓపెన్‌లో క్వార్టర్స్ చేరిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డులకెక్కింది. పురుషుల డబుల్స్ విషయానికొస్తే సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం 21-19, 21-19తో మౌలానా-కర్నండొ (ఇండోనేషియా)ను ఓడించి క్వార్టర్స్ చేరారు. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్.. 21-18, 15-21, 8-21తో ఆరో సీడ్ చైనీస్ తైఫీ షట్లర్ చౌ టైన్ చెన్ చేతిలో పోరాడి ఓడాడు.