షెన్జెన్ (చైనా): ఈ సీజన్లో తొలి టైటిల్ వేటలో ఉన్న భారత అగ్రశ్రేణి జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టికి మరోసారి నిరాశే ఎదురైంది. వరుసగా రెండో టోర్నీలో ఫైనల్ చేరిన ఈ ద్వయం.. చైనా మాస్టర్స్ సూపర్-750 టోర్నీలోనూ రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్‌లో ఎనిమిదో సీడ్ భారత జోడీ.. 19-21, 15-21తో టాప్ సీడ్ కిమ్ వోన్ హో-సియో సియాంగ్ జే (కొరియా) చేతిలో పరాభవం పాలైంది.
45 నిమిషాల్లో ముగిసిన పోరులో ప్రపంచ నెంబర్ వన్ కొరియా జంట వరుస గేమ్స్‌లో భారత ద్వయాన్ని ఓడించి టైటిల్ ఎగురేసుకుపోయింది. ఈ సీజన్లో ఇప్పటికే 9వ ఫైనల్ ఆడుతూ ఆరు టైటిల్స్ సాధించిన కొరియన్ జోడీ.. తాజాగా మరో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. తొలి గేమ్ ఆరంభంలో ఆధిపత్యం చేతులు మారినా 17-17తో స్కోర్లు సమం కాగా చిరాగ్ చేసిన తప్పిదం కొరియాకు ఆధిక్యాన్ని అందించి గేమ్‌ను దక్కించుకునేలా చేసింది. రెండో గేమ్‌లోనూ 9-9తో రెండు జంటలూ సమంగా నిలిచినా భారత ద్వయం చేసిన తప్పిదాలను తమకు అనుకూలంగా మలుచుకున్న కిమ్-సియో జోడీ టైటిల్‌ను దక్కించుకుంది.