బ్యాంకాక్: ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మొదటి దశ పోటీల్లో భారత ఆర్చర్ల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే రెండు కాంస్యాలతో పాటు నాలుగు ఈవెంట్లలో ఫైనల్‌కు చేరిన భారత్.. గురువారం మరో క్యాటగిరీలో తుదిపోరుకు అర్హత సాధించి పసిడి రేసులో నిలిచింది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ క్యాటగిరీలో తెలంగాణ అమ్మాయి తానిపర్తి చికిత, రజత్ చౌహాన్ ద్వయం సెమీఫైనల్లో 157-153తో కజకిస్థాన్‌ను చిత్తుచేసి ఫైనల్ చేరింది. అంతకుముందు క్వార్టర్స్‌లో 159-155తో చైనీస్ తైపీ ఆర్చర్లను ఇంటికి పంపింది. ఈ టోర్నీలో భారత్.. ఉమెన్స్ రికర్వ్ వ్యక్తిగత, మెన్స్ రికర్వ్ టీమ్, ఉమెన్స్ కాంపౌండ్ టీమ్, మిక్స్డ్ కాంపౌండ్ టీమ్, మెన్స్ కాంపౌండ్ వ్వక్తిగత విభాగాల్లో ఫైనల్ చేరి పసిడి పతకాలే లక్ష్యంగా బరిలో ఉంది.