శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే
‘రామ’ అన్న పదంలోనే మానవత్వం పరిమళిస్తుంది. ఆదర్శ వారసత్వాన్ని స్థిరమైన ఆస్తిగా భావించి, ఆపాదించుకొని బతకాలని మన భారతీయ సంస్కృతి పదే పదే చెబుతూ వస్తుంది. మనిషి మహాత్ముడు అవ్వాలంటే.. ప్రపంచాన్ని ఉద్ధరించాల్సిన పనిలేదు. మనిషిగా బతుకుతూ తన ధర్మాన్ని నిర్వర్తిస్తే చాలు. ఈ విషయాన్ని రాముడి జీవితం కన్నా మరేదీ నిరూపించలేదు.
మనిషి తత్వమే మానవత్వం. దాన్ని మరచి ఏదో సాధించేయాలనే ఆత్రుతతో మనిషి తనను తానే మరిచిపోతున్న నేటి కాలంలో ‘రామ కథ’ను స్మరించుకోవడం అనివార్యం. భూమి మీద గాలి ఉన్నంత వరకూ, చెట్టూపుట్టా-రాయీరప్పా ఉన్నంత వరకూ, సూర్యచంద్రుల ఉనికి ఉన్నంత వరకూ, మానవీయ పరిమళాలు ఆవిరైపోనంత కాలం శ్రీరామకథ ఉంటుంది. అది కేవలం కథ మాత్రమే కాదు, నడయాడిన మానవతా ధర్మం. మనిషి ఉనికికి నిజమైన అర్థం. మానవత్వానికి పరమార్థం. రామాయణ ఘట్టాల్లోని ఆంతరంగిక భావాన్వేషణ, మానవీయ విలువల కోసం రాముడు పడిన తపన, అడుగడుగునా ఎదురైన అనుకోని పరిస్థితుల వెల్లువ, అన్నిటినీ తట్టుకొని జీవితాన్ని కొనసాగించడం, ఇలా ఎన్నో విషయాలు గంభీర తత్వాలై దాగున్నాయి. వాటిని మనం నిశితంగా పరిశీలించి, అర్థం చేసుకుంటే మనిషిగా మన జన్మ ధన్యం అవుతుంది. వాటిని ఆదర్శంగా ఆపాదించుకోగలిగితే మానవత్వం తప్పకుండా పరిమళిస్తుంది. శ్రీరాముడు లోక కల్యాణం కోసం అవతరించాడని అనుకొని మరీ అన్నిటినీ తట్టుకొని నిలడబలేదు. మనిషిగా తన జీవితం నిర్వర్తించుకొని బతకాలనుకున్నాడు. కాబట్టి మానవత్వం లోక కల్యాణం దిశగా ఉదయించింది. మనిషంటే ఎలా బతకాలో తెలియజెప్పేందుకే ధర్మం మనిషి రూపంలో రాముడిలా ఆవిష్కృతమైంది.
శ్రీరామ కథ.. జనగాథని చెప్పవచ్చు. తల్లిదండ్రుల పట్ల భక్తి, సోదర ప్రీతి, భార్య పట్ల గౌరవం- ప్రేమ, ప్రతిజ్ఞాపాలన, ఆశ్రిత వాత్సల్యం, స్నేహనిరతి, నిస్వార్థ చింతన, పరోపకారనిరతి, లోకమర్యాదానుసరణం, నిశ్చలమైన మనోప్రవృత్తి, మానవీయ కోణం వంటి ఎన్నిటినో తన జీవిత రూపంలో ప్రజలకు అంకితం చేశాడు శ్రీరాముడు. మానవ జీవన మార్గదర్శకుడిగా, జీవిత మాధుర్య ప్రదర్శకుడిగా, విశ్వ మానవ కల్యాణమే పరమావధిగా బతికినవాడు శ్రీరాముడు. గొప్ప వంశంలో పుట్టిన రాముడు విద్యాబుద్ధులు నేర్చుకొని అయోధ్యకు తిరిగివచ్చాడు. చదువులంటే ప్రపంచాన్ని ఏలగలిగే తెలివితేటలు కాదు, సంస్కారం అని తన్ను తాను మలుచుకున్నాడు. తండ్రి ఆదేశించగానే విశ్వామిత్రుడితో యజ్ఞసంరక్షణ కోసం వెళ్లినప్పుడు తాటకిని స్త్రీ అని సందేహిస్తుంటే.. ‘అది నీ కర్తవ్యమ’నగానే వినయంగా అంగీకరించాడు రాముడు. ‘కౌసల్య సుప్రజా రామా ఉత్తిష్ఠ’ అనగానే జీవితమంటే విశ్రమించడం కాదు శ్రమించడమని తాను మేల్కొని లోకానికంతటికీ మేల్కొలుపును కలిగించాడు. సీతను పెళ్లి చేసుకొని ఏక పత్నీవ్రతుడిగా ఉంటానని ప్రతిన బూని ఆదర్శదాంపత్యం గురించి ప్రపంచానికి చాటాడు. సీత కూడా రామునికి ఏ మాత్రం తీసిపోదు. అన్నింటిలోనూ అందెవేసిన చేయి ఆమెది. ‘జీవితం నన్ను రాముడితో ముడిపెట్టింది. అది మా జీవితాలను ఎలా మలిస్తే అలా తప్పక బతకాల’ని నిర్ణయించుకుంది. ఇక్కడ రాముడిది చాదస్తం కాదు, సీతది మొండితనం కాదు. మనపట్ల మనం తీసుకున్న నిర్ణయాలైనా పరిస్థితుల ప్రభావంతో తలొగ్గేవైనా కట్టుబడి ఉండాలన్న వారి దార్శనికత.
తల్లి కోరగా, తండ్రి ఆజాపించగా అరణ్యాలకు బయలుదేరిన రాముని గుణం ప్రతిజ్ఞాపాలన మాత్రమే కాదు. జీవితంలో కొన్ని అనిశ్చితి పరిస్థితులు తలెత్తుతాయి. మౌనంగా వాటిని స్వీకరించాలి. వాటి పరిణామాలు ఏవైనా తలొగ్గాలి అనే ఆంతర్యం కూడా. రాముడు అడవులకు వెళ్లకపోయి ఉంటే ఒక గొప్ప రాజు అయ్యేవాడు. కానీ, ఆ స్థితే రాముణ్ని దేవుణ్ని చేసింది. సీత దూరమైనప్పుడు సీత అనుభవించిన వేదనకన్నా రాముని హృదయ వేదన అతీతం కాదు. ఎందుకంటే వారిది ఆదర్శదాంపత్యం. సీత జాడ తెలియలేదు, ఇక జీవితం వ్యర్థమనుకున్నాడు కానీ, ప్రయత్నం మాత్రం మానలేదు. రావణుడిలోని అసురుణ్ని వధించాడు కానీ, రావణ బ్రహ్మను ఎప్పుడూ విమర్శించలేదు. అన్నీ ముగిసి ఇంటికి చేరి పట్టాభిషక్తుడై అన్నదమ్ములతో, పిల్లలతో, తనను ఆదరించే వారితో, తాను ఆదరించాల్సిన ప్రజలతో పదివేల సంవత్సరాల పరిపాలన చేశాడని రాముణ్ని స్తుతించింది రామాయణం. ఇదంతా కేవలం కథ కాదు. మనిషి జీవితంలో జరిగే పరిణామాలు, వాటి తాలూకు భావ పరంపరలు ఎలా ఉంటాయో చెప్పే వాస్తవికత. మనిషి జీవితం పూల బాటకాదు. వడ్డించిన నిండైన విస్తరి అంతకన్నా కాదు. సులువైన మార్గం కాదు. ఇట్టే గడిచిపోయే కాలం కాదు. పుట్టినవారికి మరణం తప్పదు అన్న వాస్తవం తెలిసిన మనిషి తన చివరిశ్వాస వరకూ కొనసాగించే నిత్యపోరాటం. అందుకనే మనిషిగా బతకాల్సిందే!
మానవత్వం వదిలిపెట్టక మనల్ని మనం నిశ్చయంగా నిలబెట్టుకోగలిగితే లోక కల్యాణం తప్పకుండా జరుగుతుంది. లోకం బాగుంటే అందులో మనం కూడా బాగుంటాం. శ్రీరామచరితం- మానవ జీవన చరితం. ఆయన మార్గమే మనకు ఆదర్శం. మనలోని మానవత్వాన్ని కాపాడుకుంటూ, కుటుంబ విలువల్ని నిలబెట్టుకుంటూ, సమాజం పట్ల సుముఖతను వ్యక్తపరుస్తూ, దేశం పట్ల భావ వైశాల్యం కలిగి ఉంటూ మనుషులుగా బతకడమే సీతారాముల ఆదర్శవాదానికి మనం అందించే నిజమైన నీరాజనం.