న్యూయార్క్ : భారత స్టార్ చెస్ క్రీడాకారిణి, గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. టోర్నీలో 11 పాయింట్లకు గాను ఆమె 8.5 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకోవడంతో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన 11వ రౌండ్లో హంపి.. ఇరెనె సుకందర్ (ఇండోనేషియా)ను ఓడించడంతో టైటిల్ నెగ్గింది. ఈ టోర్నీని గెలుచుకోవడం హంపికి ఇది రెండోసారి. 2019లో జార్జియాలో నిర్వహించిన టోర్నీలోనూ హంపి సత్తా చాటింది. తద్వారా వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు గెలిచిన ప్లేయర్లలో చైనా క్రీడాకారిణి జు వెంజున్ తర్వాతి స్థానంలో నిలిచింది.
తొలి గేమ్‌లో ఓడిపోయినప్పటికీ హంపి తర్వాత పుంజుకుని టైటిల్‌ను దక్కించుకుంది. భారత్ నుంచి ద్రోణవల్లి హారిక (8 పాయింట్లు) ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇదే టోర్నీ పురుషుల విభాగంలో రష్యాకు చెందిన 18 ఏండ్ల కుర్రాడు వోలోదర్ ముర్జిన్ టైటిల్ గెలిచాడు. 10 పాయింట్లతో అతడు చాంపియన్‌గా అవతరించాడు. ఆరంభంలో వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి ఆఖర్లో తడబడి 9 పాయింట్లతో ఐదో స్థానంతో సంతృప్తి పడాల్సి వచ్చింది.