CSK | లక్నో: ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ వరుస ఓటములకు ఫుల్స్టాప్ పడింది. ప్లేఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో సత్తాచాటింది. సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌పై విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 5 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో 168 స్కోరు చేసింది. శివమ్ దూబే(37 బంతుల్లో 43 నాటౌట్, 3 ఫోర్లు, 2సిక్స్‌లు), ధోనీ(11బంతుల్లో 26 నాటౌట్, 4ఫోర్లు, సిక్స్) జట్టు విజయంలో కీలకమయ్యారు.
బిష్ణోయ్ (2/18) రెండు వికెట్లు తీశాడు. తొలుత టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులకే పరిమితమైంది. రిషభ్ పంత్ (49 బంతుల్లో 63, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఈ సీజన్‌తో తొలి అర్ధ సెంచరీతో రాణించగా మిచెల్ మార్ష్ (30) ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో జడేజా (2/24), పతిరాన (2/45) తలా రెండు వికెట్లు తీశారు. వికెట్లు పడకపోయినా నూర్ అహ్మద్.. 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి లక్నోను కట్టడి చేశాడు.
స్వల్ప ఛేదనలో లక్నో మాదిరిగానే చెన్నై కూడా తడబడింది. సీఎస్కేకు తొలి మ్యాచ్ ఆడిన ఆంధ్ర కుర్రాడు షేక్ రషీద్ (19 బంతుల్లో 27, 6 ఫోర్లు) సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. రచిన్‌తో కలిసి అతడు తొలి వికెట్‌కు 4.5 ఓవర్లలోనే 52 పరుగులు జతచేశాడు. ఈ సీజన్ పవర్ ప్లేలో ఫిఫ్టీ ప్లస్ స్కోరు చేయడం చెన్నైకి ఇది రెండోసారి మాత్రమే. అయితే అవేశ్ ఖాన్ రాకతో చెన్నై వికెట్ల పతనం మొదలైంది.
అతడి 5వ ఓవర్లో రషీద్.. పూరన్‌కు క్యాచ్ ఇవ్వడంతో చెన్నై ఇన్నింగ్స్ తడబడింది. క్రీజులో కుదురుకున్న రచిన్.. మార్క్మ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. బిష్ణోయ్ రంగప్రవేశంతో సీఎస్కే కష్టాలు రెట్టింపయ్యాయి. బిష్ణోయ్ 13వ ఓవర్లో జడేజా(7) పెవిలియన్ చేరగా, ఓవర్ తేడాతో దిగ్వేశ్ బౌలింగ్‌లో విజయ్ శంకర్(9) పెవిలియన్ చేరాడు. దీంతో 111 పరుగులకే చెన్నై 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శివమ్ దూబే, కెప్టెన్ ధోనీ..లక్నో బౌలర్లకు ఎదురొడ్డి నిలుస్తూ చెన్నైకి కీలక విజయాన్ని అందించారు.
స్పిన్నర్లకు సహకరించే ఏకనా పిచ్‌పై లక్నో ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. టాపార్డర్ వైఫల్యంతో ఆ జట్టు ఈ సీజన్లో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. బంతి దొరికితే స్టాండ్స్‌లోకి పంపిస్తూ పవర్ ప్లేలో వీరవిహారం చేసే బ్యాటింగ్ ద్వయం మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ (9 బంతుల్లో 8) సైతం చెన్నై బౌలర్ల ధాటికి నిలువలేకపోయారు. మొదటి ఓవర్లోనే ఖలీల్ (1/38).. మార్క్మ్‌న్రు ఔట్ చేసి చెన్నైకి తొలి బ్రేక్‌నిచ్చాడు. భీకర ఫామ్‌లో ఉన్న పూరన్‌ను అన్షుల్.. 4వ ఓవర్లో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తొలి 6 ఓవర్లలో లక్నో స్కోరు 42/2 మాత్రమే. పూరన్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. ఓవర్టన్ బౌలింగ్‌లో సిక్సర్‌తో జట్టు స్కోరును 50 పరుగుల మార్కును దాటించాడు.
క్రీజులో నిలదొక్కుకునేందుకు తంటాలు పడ్డ మార్ష్‌ను.. 10వ ఓవర్లో జడ్డూ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఓ బౌండరీ, రెండు సిక్సర్లతో ధాటిగా ఆడిన బదోని (22).. జడేజా బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడేందుకు యత్నించగా ధోనీ స్టంపౌట్‌తో అతడి ఇన్నింగ్స్ ముగిసింది. స్పిన్నర్ల రాకతో లక్నోకు పరుగుల రాక మందగించింది. ముఖ్యంగా నూర్ అహ్మద్ బౌలింగ్‌లో పంత్ తంటాలు పడ్డాడు. 39 బంతుల్లో 40 పరుగులు చేసిన పంత్.. ఆ తర్వాత పతిరాన బౌలింగ్‌లో గేర్ మార్చి 2 సిక్సర్లు బాది ఈ సీజన్లో తొలి అర్ధ శతకాన్ని నమోదుచేశాడు. ఆఖర్లో సమద్ (20) రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. పతిరాన వేసిన ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు పడటంతో లక్నో తక్కువ స్కోరుకే పరిమితమైంది.
1 .ఐపీఎల్లో అత్యధిక(201) ఔట్లలో భాగమైనవారిలో చెన్నై వికెట్‌కీపర్ ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు. కార్తీక్(182), డివిలీర్స్(126), ఉతప్ప(124) ఆ తర్వాత ఉన్నారు.
లక్నో: 20 ఓవర్లలో 166/7 (పంత్ 63, మార్ష్ 30, జడేజా 2/24, పతిరాన 2/45)
చెన్నై: 19.3 ఓవర్లలో 168/5(దూబే 43 నాటౌట్, రవీంద్ర 37, బిష్ణోయ్ 2/18, దిగ్వేశ్ 1/23)