అంతర్జాతీయ స్థాయిలో గానీ ఐపీఎల్లో గానీ ఆయా జట్లు ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు సొంత వేదికలను తమకు అనుకూలంగా రూపొందించుకోవడం సర్వ సాధారణం. పిచ్‌లపై చర్చ (రచ్చ) ఈనాటిది కాదు. కానీ హోంగ్రౌండ్లో సొంత అభిమానుల మధ్య మ్యాచ్ ఆడుతూ ఓడటం ఏ జట్టుకైనా ఇబ్బందికర పరిస్థితే. కారణాలేవైనా తమ ఓటములకు జట్లన్నీ మూకుమ్మడిగా క్యూరేటర్ల మీదే భారం వేస్తున్నాయి. ఐపీఎల్-18లో ఇప్పుడిదే హాట్ టాపిక్!
-నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
IPL | హైస్కోరింగ్ థ్రిల్లర్లు, ఆఖరి ఓవర్ ఫలితాల మధ్య ఆహ్లాదంగా సాగుతున్న ఐపీఎల్-18కు పిచ్‌ల వివాదం మరక అంటుకున్నది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ (కోల్‌కతా X బెంగళూరు) నుంచి మొదలుకుని రెండ్రోజుల క్రితం ముగిసిన బెంగళూరు X ఢిల్లీ పోరు వరకూ పలుమార్లు ఆయా జట్ల సారథులు, మెంటార్లు తమ ఓటములకు పిచ్ క్యూరేటర్లను బాధ్యులను చేస్తున్నారు. క్యూరేటర్లు తమకు హోం అడ్వాంటేజీ లేకుండా చేస్తున్నారని వాపోతున్నారు. సొంత మైదానంలో పిచ్ కూడా ప్రత్యర్థులకు అనుకూలంగా మారితే ఇక తాము అద్దెలు కట్టి లాభమేంటని ఫ్రాంచైజీలు క్యూరేటర్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
ఈడెన్ గార్డెన్స్‌లో బెంగళూరు చేతిలో ఘోర పరాభవం తర్వాత కోల్‌కతా సారథి రహానే స్పందిస్తూ.. ‘పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందని ఆశించాం. కానీ అలా జరుగలేదు. మా జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నప్పటికీ మేం అనుకున్న విధంగా పిచ్ స్పందించలేదు’ అని వ్యాఖ్యానించి ఈ వివాదానికి తెరలేపాడు. రహానే.. లక్నోతో ఓటమి అనంతరం ‘పిచ్ గురించి ఇప్పటికే చాలా చర్చ నడుస్తున్నది. ఇప్పుడు నేనేమైనా చెబితే అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. కేకేఆర్ సారథితో పాటు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ జహీర్ ఖాన్ కూడా పంజాబ్‌తో పరాభవం తర్వాత మాట్లాడుతూ.. ‘ఐపీఎల్లో హోంగేమ్ అంటే ఆతిథ్య జట్టుకు కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ మా క్యూరేటర్ మాత్రం దీనిని అలా భావించినట్టు లేదు. ఈ పిచ్‌ను చూస్తుంటే పంజాబ్ క్యూరేటర్ తయారు చేసినట్టుంది’ అని వాపోయాడు. తాజాగా ఢిల్లీతో మ్యాచ్ ఓడాక బెంగళూరు మెంటార్ దినేశ్ కార్తీక్ సైతం ఇదే విధంగా వ్యాఖ్యానించాడు. ‘చిన్నస్వామిలో మేం (ఆర్సీబీ) ఆడిన రెండు మ్యాచ్‌లలో మాకు బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లు కావాలని కోరాం. కానీ ఇక్కడ బ్యాటింగ్ చేయడమే కష్టంగా మారింది’ అని చెప్పడంతో ఈ వివాదం మరింత ముదిరింది. కోచ్‌లు, మెంటార్లే కాదు.. సైమన్ డౌల్ (న్యూజిలాండ్), హర్షా భోగ్లే వంటి క్రికెట్ విశ్లేషకులు సైతం క్యూరేటర్లను నిందిస్తున్నారు. ఐపీఎల్లో ఫ్రాంచైజీలు మైదానాలకు అద్దె కట్టి తీసుకుంటున్నప్పుడు క్యూరేటర్లు హోంటీమ్‌కు అనుకూలంగా పిచ్‌లు తయారు చేయకుంటే అక్కడ్నుంచి వేరే మైదానానికి మారిపోతే మంచిదని డౌల్ వ్యాఖ్యానించాడు.
పిచ్‌ల వివాదంపై క్యూరేటర్లు సైతం ఘాటుగానే స్పందిస్తున్నారు. ఈడెన్ గార్డెన్ పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ అయితే ఓ అడుగు ముందుకేసి ‘మీ వైఫల్యానికి మేం బాధ్యులమా?’ అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లో రహానే విమర్శలపై ముఖర్జీ మాట్లాడుతూ.. ‘బీసీసీఐ మార్గదర్శకాల మేరకే పిచ్‌ను తయారుచేశాం. ఐపీఎల్ నిబంధనల ప్రకారం పిచ్‌ను ఇలా తయారు చేయాలని చెప్పే అధికారం ఫ్రాంచైజీలకు లేదు. నేనెప్పుడూ బంతికి బ్యాట్‌కు అనుకూలించే సమతూకమైన పిచ్‌ను తయారు చేస్తా. ఇక్కడ చాలాకాలంగా అలాంటి వికెట్‌నే రూపొందిస్తున్నాం. బెంగళూరుతో మ్యాచ్‌లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించింది. ఆర్సీబీ స్పిన్నర్లు వికెట్లు తీసినప్పుడు కోల్‌కతా స్పిన్నర్లు ఎందుకు తీయలేకపోయారు?’ అని అన్నాడు.
ఐపీఎల్లో హోం అడ్వాంటేజ్ సర్వ సాధారణమే అయినప్పటికీ చాలా సీజన్లుగా ఆయా వేదికల్లో మ్యాచ్‌లు ఆడుతున్న జట్లకు అన్ని వేదికలపై కచ్చితమైన అవగాహన ఉంటుంది. పిచ్ ఎలా స్పందిస్తుంది? అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయి? టాస్ వంటి ఇతరత్రా ఎన్నో అంశాలు మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశిస్తాయి. 2010 సీజన్ నుంచి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మ్యాచ్ గెలవని బెంగళూరు, ఢిల్లీ ఈ సీజన్లో ఎలా గెలిచాయి? వాంఖడేలోనూ బెంగళూరు చాలాకాలం తర్వాత బోణీ కొట్టింది. తాము సరిగ్గా రాణించక పిచ్‌ను నిందించడం చూస్తే ఆయా జట్ల పరిస్థితి ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.