చెన్నై : ప్రతిష్టాత్మక చెన్నై మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ మూడో ఎడిషన్ ప్రారంభరోజునే అపశృతి చోటుచేసుకుంది. బుధవారం నుంచి చెన్నైలోని హ్యాట్ రెజెన్సీ వేదికగా ఈ టోర్నీ ఆరంభం కావాల్సి ఉన్నా హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో పోటీలను గురువారానికి వాయిదా వేశారు. భారత గ్రాండ్‌మాస్టర్, టోర్నీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న శ్రీనాథ్ నారాయణన్ ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘చెన్నై గ్రాండ్ మాస్టర్స్ నిర్వహించతలపెట్టిన హ్యాట్ రెజెన్సీలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.
దీంతో ఆటగాళ్లందరినీ సమీపంలో ఉన్న హోటల్‌కు తరలించాం. టోర్నీని ఒకరోజు వాయిదా వేశాం’ అని వెల్లడించాడు. గురువారం నుంచి మొదలయ్యే ఈ టోర్నీ ఈనెల 15న ముగియనుంది. పది మంది మేటి గ్రాండ్ మాస్టర్లు పాల్గొననున్న ఈ టోర్నీలో తొమ్మిది రౌండ్లు ఉన్నాయి. మాస్టర్స్ విభాగంలో యువ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేసి పాటు భారత్ నుంచి విదిత్, కార్తికేయన్, నిహాల్ వంటి ఆటగాళ్లు బరిలో ఉన్నారు.