Champions Trophy 2025 | ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగనున్నది. ఈ మెగా ఈవెంట్‌కు బీసీసీఐ రేపో మాపో జట్టును ప్రకటించనున్నది. జట్టును ప్రకటించేందుకు ఈ నెల 12 వరకు అవకాశం ఉన్నది. ఫామ్‌లో లేని కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ క్రికెటర్ విరాట్ వన్డే జట్టులో చోటు దక్కనున్నది. అయితే, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టు ఎంపిక కోసం ముగ్గురు సీనియర్ ఆటగాళ్లపై చర్చించే అవకాశం ఉన్నది. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ మొదలవనున్న నేపథ్యంలో కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, జడేజాలను తీసుకుంటారా? లేదా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చివరగా 2023లో జరిగిన ప్రపంచకప్ జట్టులో ముగ్గురికి వరల్డ్ కప్‌లో చోటు దక్కింది.
వరల్డ్ కప్ తర్వాత షమీ, జడేజాలకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. ఆ తర్వాత టీమిండియా కేవలం ఆరు వన్డేలు మాత్రమే అడింది. అయితే, కేఎల్ రాహుల్ మాత్రం దక్షిణాఫ్రికా, శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో చోటు దక్కింది. శ్రీలంకతో సిరీస్‌లో రాహుల్‌ను మధ్యలోనే జట్టు నుంచి తప్పించింది. 2023 నవంబర్ 19న వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 107 బంతులు ఆడిన రాహుల్.. కేవలం 66 పరుగులు మాత్రమే చేయడమే ప్రధాన కారణం. ఇక యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ వన్డే జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలున్నాయి. టాప్ ఫోర్లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు బెర్త్ దాదాపు ఖాయంగా కనిపిస్తుంది.
చాంపియన్స్ ట్రోఫీలో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. రాహుల్ వికెట్ కీపింగ్ చేయకపోతే బ్యాట్స్‌మెన్‌గా జట్టులో స్థానం అనుమానమే. మరో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ విజయ్ హజారే ట్రోఫీలో పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. కోచ్ గౌతమ్ గంభీర్ సెలక్షన్ విషయాల్లో తనదైన శైలిని కొనసాగిస్తే.. సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌తో పాటు కుల్దీప్ యాదవ్ ఫిట్‌నెస్‌పై సెలెక్టర్లు కన్నేశారు. పూర్తిగా ఫిట్‌గా ఉన్నా.. విజయ్ హజారే ట్రోఫీలో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. కుల్దీప్ను పక్కన పెట్టాలని భావిస్తే.. రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిలో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.
ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఫిట్నెస్ విషయంలో ఇంకా స్పష్టత లేదు. విజయ్ హజారే ట్రోఫీలో చివరి రెండు మ్యాచుల్లో ఎనిమిది ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. బుమ్రా దూరమైతే మాత్రం షమీ అనుభవం టీమిండియాకు ఉపకరించే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాట్స్మెన్లలో రింకు సింగ్, తిలక్ వర్మల్లో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది.
చాంపియన్స్ ట్రోఫీకి జట్టు (అంచనా) : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి / రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ / మహమ్మద్ షమీ, రింకూ సింగ్ / తిలక్ వర్మ.