శ్రీనగర్: ఇండియన్ హెవెన్ ప్రీమియర్ లీగ్(Srinagar Cricket League) నిర్వాహకులపై జమ్మూకశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనగర్లో నిర్వహించిన ఆ టోర్నీలో అంతర్జాతీయ క్రికెటర్లు పాల్గొన్నారు. ఆ టోర్నీలో క్రిస్ గేల్ కూడా ఆడుతున్నారు. టోర్నీ నిర్వహించిన ఆర్గనైజర్లు హోటల్ బిల్లులు, పేమెంట్స్ ఇవ్వకుండా వెళ్లిపోయినట్లు ఫిర్యాదు నమోదు అయ్యింది. భారతీయ న్యాయ సంహితలోని రాజ్ బాగ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. చీటింగ్ కేసును ఫైల్ చేశామని, దర్యాప్తు జరుగుతోందని సీనియర్ అధికారి చెప్పారు.
అక్టోబర్ 25వ తేదీన లీగ్ ప్రారంభమైంది. బక్షీ స్టేడియంలో టోర్నీ చేపట్టారు. మొత్తం 8 జట్లు ఆ టోర్నీలో పాల్గొన్నాయి. స్పోర్ట్స్ మినిస్టర్ సతీష్ శర్మ దీన్ని ప్రారంభించారు. పంజాబ్లోని మొహాలీకి చెందిన యువ సొసైటీ అనే గ్రూపు ఈ టోర్నీ ఆర్గనైజ్ చేసింది. నవంబర్ 8వ తేదీన ముగియాల్సిన టోర్నీ ఆదివారం అర్థాంతరంగా ముగిసిపోయింది. బిల్లులు చెల్లించకపోవడం వల్ల నాన్ లోకల్ ఆటగాళ్లు ఆడేందుకు నిరాకరించారు. నిర్వాహకులు బిల్లులు కట్టకుండా వెళ్లిపోయినట్లు హోటల్ సిబ్బంది చెప్పడంతో.. ఆటగాళ్లు, అఫీషియల్స్ ఖంగుతిన్నారు.
అయితే టోర్నీ నిర్వహిస్తున్న వారి ఫోన్లు స్విచాఫ్ అయినట్లు అనేక మంది ప్లేయర్లు చెప్పారు. ఒక్కరికీ కూడా పేమంట్ జరగలేదని ఇంగ్లండ్ అంపైర్ మెలిసా జునిపర్ ఆరోపించారు. క్రికెట్ టోర్నీ నిర్వాహకులు ఉడాయించిన అంశంపై స్పందించేందుకు జమ్మూకశ్మీర్ క్రీడా మండలి దూరంగా ఉన్నది. ఆ టోర్నీతో తమకు ప్రమేయం లేదని పేర్కొన్నది. కేవలం వేదికను మాత్రం ఇచ్చినట్లు చెప్పింది. క్రీడా నిర్వహణతో రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చినట్లు జమ్మూకశ్మీర్ బీజేపీ ఆరోపించింది.