స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కారజ్ గర్జించాడు. అలుపన్నదే ఎరుగకుండా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో విజయకేతనం ఎగరవేశాడు. అంతగా అనుభవం లేకున్నా పట్టువదలని విక్రమార్కుని వలే ప్రత్యర్థులను చీల్చిచెండాడుతూ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సగర్వంగా ముద్దాడాడు. తన విజయాలు గాలి వాటం కాదని నిరూపిస్తూ కింగ్‌లా కాలర్ ఎగరేశాడు.
సుదీర్ఘ పోరాటాలతో దిగ్గజాలను మరిపిస్తూ టెన్నిస్‌లో నవశకానికి ప్రతిరూపంగా నిలిచాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో అల్కారజ్..కాస్పర్ రూడ్‌ను మట్టికరిపిస్తూ టైటిల్ దక్కించుకున్నాడు. పిన్న వయసులో గ్రాండ్‌స్లామ్ గెలువడంతో పాటు నంబర్‌వన్ ర్యాంక్ కైవసం చేసుకున్న ప్లేయర్‌గా అల్కారజ్ కొత్త రికార్డు నెలకొల్పాడు.
న్యూయార్క్ : స్పెయిన్ టీనేజ్ సంచలనం కార్లోస్ అల్కారజ్ రాకెట్లా దూసుకొచ్చాడు. నిన్నటి వరకు సీనియర్ల ప్రాభావంలో అనామకుడిగా మెలిగిన అల్కారజ్ యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచి రఫెల్ నాదల్ వారసుడిగా ముందుకొచ్చాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో అల్కారజ్ 6-4, 2-6, 7-6(7-1), 6-3 స్కోరుతో నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌ను ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకున్నాడు. ఈ విజయంతో టాప్ ర్యాంక్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. నంబర్‌వన్ ర్యాంక్ దక్కించుకున్న అతి పిన్న వయస్కుడిగా 19 ఏండ్ల అల్కారజ్ రికార్డుల్లోకెక్కాడు. 1973లో ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టిన తరువాత అగ్రస్థానం దక్కించుకున్న పిన్న వయస్కుడు అల్కారజ్. 2001లో లేటన్ హెవిట్ 20 ఏండ్ల వయసులో అగ్రస్థానం చేరుకుని నెలకొల్పిన రికార్డును తాజాగా ఈ స్పెయిన్ యంగ్బుల్ అల్కారజ్ తిరగరాశాడు. మ్యాచ్ విషయానికొస్తే మూడున్నర గంటల పాటు హోరాహోరీ సాగిన పోరులో అల్కారజ్ పదునైన సర్వీసులతో, డ్రాప్ షాట్లతో ప్రేక్షకులను అలరించాడు. నాలుగు సెట్లపాటు సాగిన సమరంలో రూడ్ కూడా సమఉజ్జీగా పోరాడాడు. ఏస్‌లలో అల్కారజ్దే పైచేయిగా నిలిచింది. అల్కారజ్ 14 ఏస్‌లను సర్వ్ చేయగా, రూడ్ కేవలం నాలుగు మాత్రమే సంధించాడు. డబుల్ ఫాల్ట్స్‌లో ఇరువురికీ తేడా(3/2) లేనప్పటికీ అల్కారజ్ 41 అనవసర తప్పిదాలు చేశాడు. అయినా కీలక సమయంలో పాయింట్లు రాబట్టి రెట్టింపు విన్నర్స్‌తో రూడ్‌ను రన్నరప్ స్థానానికి పరిమితం చేశాడు. ఈ యేడాది యూఎస్ ఓపెన్ ప్రత్యేకత ఏమంటే ఫైనల్‌కు చేరిన ఇరువురూ తమ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్, టాప్ ర్యాంక్ కోసం తలపడడం.
అలుపెరగని అల్కారజ్:
ఫైనల్‌కు చేరుకోవడంలో అల్కారజ్ ఎంతో శ్రమించాడు. గత మూడు మ్యాచ్‌లలో అయిదు సెట్ల పోరులో ప్రత్యర్థులను ఓడించిన అల్కారజ్ ఆ ఆలసటను ఏమాత్రం కనిపివ్వకుండా ఫైనల్లో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్‌లలో అల్కారజ్ 23 గంటల 40 నిమిషాల పాటు కోర్టులో గడిపాడు. తొలి సెట్ ఆరంభంలో బ్రేక్ సాధించిన అల్కారజ్, రెండో సెట్లో తన సర్వీసును కోల్పోయాడు. దీనితో పుంజుకున్న రూడ్ రెండో సెట్ దక్కించుకుని స్కోరును సమం చేశాడు. ఇక మూడో సెట్ నువ్వానేనా అన్నట్టు సాగింది. మూడో సెట్ తొలి గేమ్‌లో బ్రేక్ సాధించిన అల్కారజ్ ఆ ఆధిక్యం నిలబెట్టుకోలేకపోయాడు. రూడ్కూడా ఒక బ్రేక్‌తో సెట్ స్కోరును 2-2గా సమం చేశాడు.
ఇద్దరు సర్వీసును నిలుపుకుంటూ పాయింట్లు సాధించడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ నెలకొంది. అల్కారజ్ రెండు సెట్ పాయింట్లను కాచుకుని చివరకు ఒక స్మాష్‌తో సెట్‌ను టైబ్రేక్‌కు తీసుకెళ్లాడు. అప్పటివరకు గట్టి పోటీ ఇచ్చిన రూడ్ టైబ్రేక్‌లో తేలిపోయాడు. నాలుగో సెట్లోనూ రూడ్ పరిస్థితిలో మార్పులేదు. అల్కారజ్‌ను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. స్పెయిన్ యంగ్‌స్టర్ ఎక్కువగా ఫోర్‌హ్యాండ్ షాట్లతో పాయింట్లను రాబట్టాడు. చివరకు ఒక పదునైన ఏస్‌తో సెట్, మ్యాచ్, ట్రోఫీ, టాప్ ర్యాంక్ అల్కారజ్ సొంతమయ్యాయి. మ్యాచ్‌కు ముందు 2001 సెప్టెంబర్ 11 దాడిలో దుర్మరణం పాలైన మృతుల స్మృత్యర్థం స్టేడియంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు.