లండన్: డిఫెండింగ్ చాంపియన్ హోదాలో వింబుల్డన్ బరిలో నిలిచిన కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్) ఈ టోర్నీలో మరో ముందడుగు వేశాడు. శుక్రవారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ మూడోరౌండ్ పోరులో రెండో సీడ్ అల్కరాజ్.. 6-1, 3-6, 6-3, 6-4తో జాన్ లెన్నర్డ్ (జర్మనీ)ను ఓడించి ప్రిక్వార్టర్స్ చేరాడు. టాప్ సీడ్ యానిక్ సిన్నర్ (ఇటలీ).. 6-1, 6-3, 6-1తో అన్‌సీడెడ్ పెడ్రొ మార్టిన్ (స్పెయిన్)ను వరుస సెట్లలో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు ప్రవేశించాడు. ఆదివారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో అల్కరాజ్.. 14వ సీడ్ ఆండ్రీ రుబ్లెవ్తో తలపడనున్నాడు.
ఇక మహిళల సింగిల్స్‌లో సంచలనాలు కొనసాగుతున్నాయి. నిరుటి విజేత క్రెజికోవ (చెక్ రిపబ్లిక్)కు 6-2, 3-6, 4-6తో ఎమ్మా నవర్రొ (యూఎస్) షాకిచ్చింది. 2022లో వింబుల్డన్ టైటిల్ గెలిచిన ఎలీన రిబాకిన (కజకిస్థాన్).. మూడో రౌండ్లో 6-7 (6/8), 3-6తో క్లారా టౌసన్ (డెన్మార్క్) చేతిలో ఓడింది. పోలండ్ బామ ఇగా స్వియాటెక్.. 6-2, 6-3తో అన్‌సీడెడ్ కొలిన్స్ (యూఎస్)ను చిత్తుచేసి ప్రిక్వార్టర్స్ చేరింది. బ్రిటన్ అమ్మాయి ఎమ్మా రడుకాను.. 6-7 (6/8), 4-6తో టాప్ సీడ్ అరీనా సబలెంక జోరుకు తలవంచింది. ఏడో సీడ్ మిర్రా ఆండ్రీవా.. 6-1, 6-3తో హేలీ (యూఎస్)ను చిత్తుచేసి నాలుగో రౌండ్ చేరుకుంది.