టెన్నిస్‌లో అద్భుతం చోటు చేసుకుంది! సుదీర్ఘ క్రీడా చరిత్రలో మరుపురాని పోరుగా కార్లోస్ అల్కరాజ్, జానిక్ సిన్నర్ మధ్య ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ పోరు నిలిచిపోయింది. ఐదున్నర గంటల పాటు నువ్వానేనా అన్నట్లు సాగిన మెగాఫైట్‌లో ఆఖరికి అల్కరాజ్‌కే ఫ్రెంచ్ కిరీటం దక్కింది. వరల్డ్ నంబర్‌వన్ సిన్నర్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లు సాగిన పోరులో అల్కరాజ్ అద్భుత విజయం సాధించాడు. ఆఖరి వరకు గెలుపు దోబూచులాడిన పోరులో సిన్నర్‌పై అల్కరాజ్ జయకేతనం ఎగురవేశాడు. ప్రత్యర్థికి తొలి రెండు సెట్లు కోల్పోయినా ఆత్మవిశ్వాసం కోల్పోని స్పెయిన్ బుల్ అసమాన పోరాటపటిమతో వరుసగా రెండోసారి ఫ్రెంచ్ టైటిల్‌ను సగర్వంగా ముద్దాడాడు. స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్కు తానే సరైన వారసుడనని చేతల్లో చూపెట్టిన వైనం నభూతో నభవిష్యత్. తుదికంటా తొలి ఫ్రెంచ్ టైటిల్ కోసం పోరాడిన సిన్నర్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.
పారిస్: ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌లో కార్లోస్ అల్కరాజ్ శకం నడుస్తున్నది. దిగ్గజ రఫెల్ నాదల్కు వారసునిగా మన్ననలు అందుకుంటున్న అల్కరాజ్ అదే బాటలో మరో ముందడుగు వేశాడు. ఆదివారం ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఫైనల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ 4-6, 6-7(7-4), 6-4, 7-6(7-3), 7-6(10-2) తేడాతో వరల్డ్ నంబర్‌వన్ జానిక్ సిన్నర్(ఇటలీ)పై చిరస్మరణీయ విజయం సాధించాడు. సరిగ్గా 5 గంటల 29 నిమిషాల పాటు సాగిన ఈ మారథాన్ పోరులో అల్కరాజ్నే అదృష్టం వరించింది. తొలి రెండు సెట్లను సిన్నర్‌కు చేజార్చుకున్న అల్కరాజ్ పుంజుకుని వరుసగా మూడు సెట్లలో మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. సిన్నర్ తప్పిదాలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ అల్కరాజ్ పోరాడిన తీరు అద్భుతమని చెప్పాలి. మ్యాచ్ చేజారిందనుకున్న ప్రతీసారి తనలో పోరాట యోధుడిని తట్టిలేపిన ఈ స్పెయిన్ నయాబుల్ వరుసగా రెండో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో కొత్త చరిత్ర లిఖించాడు. ఈ క్రమంలో 22 ఏండ్ల వయసులోనే ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అల్కరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
సిన్నర్, అల్కరాజ్ మధ్య తొలి సెట్ మొదటి గేమ్‌కు 12నిమిషాల సమయం పట్టింది. ఇక్కణ్నే ఈ ఇద్దరు ప్లేయర్ల మధ్య పోరు ఎలాగుంటుందో అభిమానులకు అర్థమయ్యింది. మరో ఎండ్‌లో తానేం తక్కువ కాదని నిరూపించుకునే క్రమంలో అల్కరాజ్ బ్రేక్ పాయింట్‌ను కాపాడుకుంటూ గేమ్‌ను దక్కించుకోవడంతో 1-1తో సమమైంది. బ్యాక్‌హ్యాండ్ షాట్లకు తోడు పవర్ఫుల్ సర్వ్‌లతో చెలరేగిన సిన్నర్ తొలి సెట్‌ను 6-4తో దక్కించుకుని శుభారంభం చేశాడు. అదే ఊపును కొనసాగిస్తూ రెండో సెట్లోకి ప్రవేశించిన సిన్నర్‌కు అల్కరాజ్ బ్రేక్ వేసే ప్రయత్నం చేశాడు. మొదట్లో వరుస గేమ్‌లు కైవసం చేసుకున్న సిన్నర్‌కు అద్భుతంగా పుంజుకున్న అల్కరాజ్ పోటీలోకి వచ్చాడు. దీంతో అలవోకగా సెట్‌ను కైవసం చేసుకుందామనుకున్న సిన్నర్‌ను టైబ్రేక్‌కు తీసుకెళ్లాడు. అయితే ఇక్కడ అదృష్టం సిన్నర్కే సొంతమైంది. 7-4తో రెండో సెట్‌ను దక్కించుకున్నాడు. మరో సెట్ గెలిస్తే కెరీర్లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సిన్నర్ సొంతమవుతుంది. కానీ కీలకమైన మూడో సెట్లో స్పెయిన్ సంచలనం ఎక్కడా తలవంచకుండా సిన్నర్‌కు దీటైన పోటీనిచ్చాడు. అప్పటి వరకు వరుస సెట్లు గెలిచి ఆత్మవిశ్వాసంతో కనిపించిన సిన్నర్‌కు అల్కరాజ్కు ఊహించని ప్రతిఘటన ఎదురైంది.
గేమ్‌కు గేమ్‌కు తన ఆటకు మరింత మెరుగులు అద్దుకున్న డిఫెండింగ్ చాంపియన్ 6-4తో మూడో సెట్‌ను గెలిచి పోటీని మరింత రసవత్తరంగా మార్చాడు. కనీసం నాలుగో సెట్‌లోనైనా గెలిచి మ్యాచ్‌ను దక్కించుకుందామనుకున్న సిన్నర్ ఆశలు నెరవేరలేదు. ఒకానొక దశలో 5-3తో మ్యాచ్ పాయింట్‌కు వచ్చిన వరల్డ్ నంబర్‌వన్‌కు అల్కరాజ్ అద్భుతమైన పోటీనిచ్చాడు. అభిమానుల అశేష మద్దతును తనకు అనుకూలంగా మలుచుకుంటూ చేజారుతుందనుకున్న మ్యాచ్‌ను అల్కరాజ్ తన వైపునకు తిప్పుకున్నాడు. ఇద్దరి మధ్య హోరాహోరీతో సెట్ కాస్తా టైబ్రేక్‌కు దారితీసింది. ఇక్కడ సిన్నర్ 2-0 ఆధిక్యం ప్రదర్శించినా అనవసర తప్పిదాలతో అల్కరాజ్కు మూల్యం చెల్లించుకున్నాడు. 5-2తో ఆధిక్యం కనబరిచిన అల్కరాజ్ 7-3తో సెట్‌ను దక్కించుకోవడంతో మ్యాచ్ కాస్తా 2-2తో సమమై నిర్ణయాత్మక ఐదో సెట్‌కు దారితీసింది. ఇందులోనూ అల్కరాజ్, సిన్నర్ పోరాటం అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆధిక్యం తరుచూ చేతులు మారిన పోరులో వెనుకంజ వేసిన ప్రతీసారి అల్కరాజ్ పుంజుకున్న తీరు అభిమానులను కట్టిపడేసింది. గెలిచే అవకాశాన్ని చేజేతులా విడిచిపెట్టుకున్న సిన్నర్..టైబ్రేక్‌లో మ్యాచ్‌ను కోల్పోవాల్సి వచ్చింది.