ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్గేమ్స్ పోటీల తోలిరోజు మన అథ్లెట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో మన జట్టు బోణీ కొట్టగా.. బాక్సింగ్‌లో శివ థాపా ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. పాకిస్థాన్ బాక్సర్‌పై పంచ్‌ల వర్షం కురిపిస్తూ రింగ్‌లో శివతాండవమాడిన థాపా.. ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు. టీటీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు.. అదిరిపోయే ఆరంభం దక్కించుకోగా.. మహిళల హాకీ తొలి రౌండ్లో మన అమ్మాయిలు ఘనాపై ఏకపక్ష విజయం సాధించారు. రెండు దశాబ్దాల తర్వాత కామన్వెల్త్లోకి తిరిగి వచ్చిన క్రికెట్లో హర్మన్‌ప్రీత్ బృందం తడబడగా.. స్విమ్మింగ్‌లో శ్రీహరి సెమీఫైనల్‌కు చేరాడు.
బర్మింగ్‌హామ్: ముచ్చటగా మూడోసారి ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అంచనాలకు అనుగుణంగా అదరగొట్టింది. గురువారం అర్ధరాత్రి దాటాక అట్టహాసంగా ప్రారంభ వేడుకలు జరుగగా.. శుక్రవారం అథ్లెట్లు పతకాల పోటీ ప్రారంభించారు. ఈ మెగాటోర్నీలో ఇంగ్లండ్ ట్రయథ్లెట్ అలెక్స్ తొలి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. భారత స్టార్ బాక్సర్ శివ థాపా కామన్వెల్త్ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం 64 కేజీల తొలి రౌండ్లో శివ 5-0తో సులేమాన్ (పాకిస్థాన్)పై విజయం సాధించాడు. మరోవైపు భారత స్టార్ స్విమ్మర్ శ్రీహరి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో శ్రీహరి 54.68 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి హీట్స్‌లో మూడో స్థానంలో నిలిచాడు.
బ్యాడ్మింటన్‌లో బోణీ
భారత బ్యాడ్మింటన్ జట్టు.. కామన్వెల్త్గేమ్స్లో బోణీ కొట్టింది. టీమ్ ఈవెంట్ తొలి పోరులో భారత్ 5-0తో పాకిస్థాన్‌పై జయభేరి మోగించింది. మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని -సుమీత్ రెడ్డి జంట నెగ్గగా.. అనంతరం శ్రీకాంత్, సింధు విజృంభిం చడంతో భారత్ ‘టై’సొంతం చేసుకోగా.. మిగిలిన మ్యాచ్‌ల్లో సాత్విక్ -చిరాగ్, త్రిసా-గాయత్రి గోపీచంద్ జోడీలు సత్తాచాటాయి.
శ్రీజ సూపర్
డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల టీటీ జట్టు.. స్థాయికి తగ్గ ఆటతో ఆకట్టుకుంది. గ్రూప్-2 తొలి మ్యాచ్‌లో మన అమ్మాయిలు 3-0తో దక్షిణాఫ్రికాను చిత్తు చేశారు. డబుల్స్‌తో పాటు సింగిల్స్‌లో తెలంగాణ ప్యాడ్లర్ శ్రీజ దుమ్మురేపింది. పురుషుల విభాగంలో భారత్ 3-0తో బార్బడోస్పై ఏకపక్ష విజయం సాధించింది.
గుర్జీత్ డబుల్ ధమాకా
టోక్యో ఒలింపిక్స్‌లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత మహిళల హాకీ జట్టు.. కామన్వెల్త్ శుభారంభం చేసింది. తొలిపోరులో భారత్ 5-0తో ఘనాను చిత్తు చేసింది. గుర్జీత్ కౌర్ (3వ, 39వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో అదరగొట్టగా.. నేహ (28వ), సంగీత (36వ), సలీమా (56వ) ఒక్కో గోల్ చేశారు.