Rohit Sharma | భారత జట్టు నవంబర్‌లో ఆస్ట్రేలియాతో ఐదుటెస్టుల సిరీస్‌లో తలపడనున్నది. ఈ సిరీస్‌లోని పలు మ్యాచ్‌లకు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో మ్యాచ్‌లకు అందుబాటులో ఉండలేనంటూ.. ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు సమాచారం. నవంబర్ 22న పెర్త్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ సిరీస్ ప్రారంభం కానున్నది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్‌లో రెండోటెస్ట్ జరుగనున్నది. రెండు మ్యాచుల్లో ఏదో ఒక మ్యాచ్‌కు అందుబాటులో ఉండనని చెప్పినట్లు తెలుస్తున్నది. భారత్ వరుస టెస్ట్ సిరీస్ విజయాలను సాధించాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టబోతున్నది. ఈ క్రమంలో రోహిత్ శర్మ మ్యాచ్‌కు దూరమ్యే అవకాశం ఉన్నట్లుగా బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది.
ప్రస్తుతానికి ఈ విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో రోహిత్ పాల్గొన్నాడు. ఈ నెల 16 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌లోనూ భారత్ తలపడనున్నది. రోహిత్ దూరమైతే అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌కు అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ సైతం ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉన్నది. ఈశ్వరన్ సైతం సిరీస్ సమయానికి ఆస్ట్రేలియాలోనే అందుబాటులో ఉండనున్నాడు. భారత్-ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రోహిత్ గైర్హాజరీలో ఎవరికి కెప్టెన్‌గా బాధ్యతలు ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో వైస్ కెప్టెన్‌ని ప్రకటించలేదు. కాన్పూర్ టెస్ట్‌కు ముందు అభిషేక్ నాయర్ మాట్లాడుతూ జట్టులో చాలామంది ఐపీఎల్ కెప్టెన్స్ ఉన్నారని చెప్పాడు.