ఢిల్లీ: బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) అధ్యక్ష ఎన్నికల రేసు రసవత్తరంగా సాగుతోంది. వరుసగా మూడోసారి అధ్యక్ష పదవిని దక్కించుకోవాలని చూస్తున్న అజయ్ సింగ్‌కు ఈసారి బీఎఫ్ఐ సెక్రటరీ జనరల్ హేమంత కలిట, ఉపాధ్యక్షుడు రాజేశ్ బండారి నుంచి తీవ్ర పోటీ ఎదురవనుంది. బీఎఫ్ఐ అధ్యక్ష రేసులో కేంద్ర క్రీడాశాఖ మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో పాటు మాజీ బాక్సర్ విజేందర్ సింగ్ నిలుస్తారని వార్తలు వచ్చినా ఆదివారం నాటికి ముగిసిన నామినేషన్ల ప్రక్రియలో ఆ ఇద్దరూ తమ దరఖాస్తులను దాఖలు చేయలేదు. దీంతో అజయ్, హేమంత, రాజేశ్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కేరళ స్టేట్ అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ డి. చంద్రలాల్ సైతం ప్రెసిడెంట్ రేసులో పోటీ పడుతున్నాడు. ఈనెల 28న గురుగ్రామ్‌లో నిర్వహించబోయే బీఎఫ్ఐ వార్షిక సాధారణ సమావేశంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.