BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త జెర్సీ స్పాన్సర్ వేటలో పడింది. కేంద్ర తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్ నియంత్రణ చట్టం కారణంగా డ్రీమ్ 11తో ఒప్పందం రద్దు చేసుకున్న బీసీసీఐ.. టీమిండియా కొత్త స్పాన్సర్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తి గల కంపెనీల నుంచి బిడ్డింగ్ స్వీకరిస్తామని తెలిపింది. స్పాన్సర్ నియమ నిబంధనల గురించిన వివరాలు సెప్టెంబర్ 2 మంగళవారం నుంచి అందుబాటులో ఉంచనుంది. అంతేకాదు దరఖాస్తులు సమర్పించేందుకు సెప్టెంబర్ 16 తుది గడువుగా నిర్ణయించింది బీసీసీఐ.
కొత్త స్పాన్సర్ ఎంపిక విషయంలో మాకు స్పష్టత ఉంది. ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్‌పై నిషేధం విధించినందున డ్రీమ్ 11 వంటి సంస్థలతో బీసీసీఐ స్పాన్సర్‌షిప్‌ను కొనసాగించదు. కొత్తగా అమల్లోకి వచ్చిన ఆంక్షల కారణంగా డ్రీమ్ 11తో ఒప్పందం ముగిసిపోయింది. అందుకే కొత్త స్పాన్సర్ ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. ఆశావహులు సెప్టెంబర్ 16లోపు బిడ్డింగ్ వేయాలి అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించాడు.
NEWS 🚨 – BCCI announces the release of the Invitation for Expression of Interest for National Team Lead Sponsor Rights
More details here 👇https://t.co/Qx6YZvYWrw pic.twitter.com/0e0vCoIdBT
— BCCI (@BCCI) September 2, 2025
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త స్పాన్సర్ ఎంపిక చేపట్టనుంది బీసీసీఐ. అందుకే.. స్పాన్సర్‌కు ఉండాల్సిన అర్హత ప్రమాణాలను వెబ్సైట్లో పెట్టింది. ఆర్ధికంగా, వ్యక్తిగతంగా కొన్ని లక్షణాలు ఉన్న వాటినే పరిశీలిస్తామని భారత బోర్డు స్పష్టంగా పేర్కొంది. అవేంటంటే.. గత మూడేళ్ల కాలంలో కంపెనీ టర్నోవర్ సగటున రూ.300 కోట్లు ఉండాలి. కంపెనీ నికర ఆస్తుల విలువ గత మూడేళ్లలో రూ.300 కోట్లు ఉండి తీరాలి.
కంపెనీపై, ఆ సంస్థ యజమానిపై ఎటువంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు. మోసాలకు పాల్పడం, ఆర్ధిక నేరాల్లో భాగమవ్వడం వంటివి అన్నమాట. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆర్ధికపరమైన ప్రయోజనాల్లో వైరుధ్యం ఉండకూడదు. ఏదైనా నేరం కింద రెండేళ్లకు పైగా జైలు జీవితం అనుభవించకూడదు. మరీ ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఇండియా జాబితాలో ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ఉండకూడదు.
#BCCI invites bids for lead sponsor rights after terminating deal with #Dream11.
For the latest news and updates, visit https://t.co/by4FF5oyu4 pic.twitter.com/wAe9t2L9zP
— NDTV Profit (@NDTVProfitIndia) September 2, 2025
అథ్లెటిక్స్, క్రీడా దుస్తులతో పాటు పరికరాల తయారీ కంపెనీలు బిడ్డింగ్ వేయవచ్చు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలు, ఫైనాన్షియల్ సర్వీస్ అందించే కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆల్కహాల్ లేని శీతల పానీయాల కంపెనీలు కూడా అర్హులే. బీమా కంపెనీలతో పాటు ఫ్యాన్స్ మిక్సర్ గ్రౌండర్స్, సేఫ్టీ లాక్స్ సంస్థలు కూడా ఆసక్తి ఉంటే బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చు.
ఆన్లైన్ మనీ గేమింగ్, బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్‌తో సంబంధం ఉన్న కంపెనీలు. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వ్యాపారాలతో ముడిపడి ఉన్న కంపెనీలు. ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ చట్టం 2025 ప్రకారం నిషేధిత జాబితాలో ఉన్న కంపెనీలు.
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ముందే జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్ 11తో ఒప్పందం రద్దు కావడంతో టీమిండియా స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగనుంది. అయితే.. ఆసియా కప్ జరుగుతుండగానే కొత్త స్పాన్సర్‌ను వెతికే పనిలో పడింది బీసీసీఐ. తొలి పోరులో భారత్ సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో.. సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో.. సెప్టెంబర్ 19న ఒమన్తోతలపడనుంది.