ముంబై: సరిగ్గా 14 ఏళ్ల కిందట ఇదే రోజు ఓ అద్భుతం జరిగింది. ఇండియన్ క్రికెట్లో ఎవరూ ఊహించని, కనీవినీ ఎరగని అద్భుతమది. 1983లో ఏమాత్రం అంచనాల్లేని కపిల్ డెవిల్స్.. రెండుసార్ల విశ్వవిజేతను మట్టి కరిపించి ఎలాగైతే ప్రపంచకప్‌ను అందుకున్నదో.. 2007లోనూ అలాగే తొలిసారి జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ను అందుకుంది ధోనీ సేన. అదే ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో దారుణ పరాభవంతో కుంగిపోయి, సీనియర్లు దూరమై.. ఓ యువ కెప్టెన్ సారథ్యంలో ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన టీమిండియా.. క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. సఫారీ గడ్డపై 2007, సెప్టెంబర్ 24న దాయాది పాకిస్థాన్‌ను మట్టి కరిపించి వరల్డ్‌కప్‌ను సగర్వంగా ముద్దాడింది ధోనీ సేన.
ఆ ఫైనల్లో చివరి ఓవర్‌ను జోగిందర్ శర్మకు ఇచ్చి ఆశ్చర్యపరిచిన ధోనీ.. తర్వాతి కాలంలో అలాంటి ఎన్నో నిర్ణయాలతో షాకులిస్తూనే ఇండియన్ క్రికెట్ టీమ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాడు. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరమైన సమయంలో అప్పటికే ఓ సిక్స్ కొట్టి పాక్‌ను గెలిపించేలా కనిపించిన మిస్బావుల్ హక్.. ఓ స్కూప్ షాట్ ఆడి శ్రీశాంత్‌కు దొరికిపోవడం, టీమిండియా సంబురాలు చేసుకోవడాన్ని క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మరచిపోదు. ఆ అద్భుతం జరిగి 14 ఏళ్లయిన సందర్భంగా బీసీసీఐ మరోసారి ఆ వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇండియాను తొలిసారి టీ20 విశ్వవిజేతగా నిలిపిన ధోనీ.. ఇప్పుడు మళ్లీ అదే టీ20 వరల్డ్‌కప్‌కు టీమ్ మెంటార్‌గా వస్తున్నాడు. మరి ఈసారి యూఏఈ గడ్డపై ఏం అద్భుతం చేస్తాడో చూడాలి.
#OnThisDay in 2007!
— BCCI (@BCCI) September 24, 2021
The @msdhoni-led #TeamIndia created history as they lifted the ICC World T20 Trophy. 🏆 👏
Relive that title-winning moment 🎥 👇 pic.twitter.com/wvz79xBZJv