BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త కోచ్‌ల వేటలో పడింది. యువ క్రికెటర్ల భవితను గొప్పగా మార్చే, గాయపడిన వాళ్లను మునపటిలా రాటుదేలాలా చేసే బృందం ఎంపికకు కసరత్తును షురూ చేసింది భారత బోర్డు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(COE)లో సేవలందిస్తున్న పలువురి పదవీ కాలం ముగియనుండడమే అందుకు కారణం. ప్రస్తుతం సీఏఈలో బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్న ట్రాయ్ కూలే (Troy Cooley) కాంట్రాక్ట్ మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది. దాంతో అతడి స్థానాన్ని భారత మాజీ పేసర్‌తో భర్తీ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఆశావహులు ఆగస్టు 20వ తేదీలోపు దరఖాస్తులు పంపాలని ఒక ప్రకటనలో వెల్లడించింది.
నేషనల్ క్రికెట్ అకాడమీకి దీటుగా సకల హంగులతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను బీసీసీఐ నిర్మించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఓఈను ప్రారంభించారు. అయితే.. ఇప్పటికే కోచింగ్ బృందంలో దాదాపు ఖాళీ అయింది. బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన సితాన్షు కొటాక్ (Sitanshu Kotak) పూర్తి స్థాయిలో టీమిండియా బృందంలో చేరాడు. స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహతులే ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) సహాయక సిబ్బందిలో చేరాడు.
వైద్యబృందలోని నితిన్ పటేల్ మార్చ్‌లోనే మానేశాడు. 2021 డిసెంబర్ నుంచి ఎన్సీఏ హెడ్‌గా కొనసాగుతున్న వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) పదవీ కాలం కూడా కొద్ది రోజులే ఉంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్‌లతో, డైరెక్టర్‌తో అకాడమీని బలోపేతం చేయాలనుకుంటోంది బీసీసీఐ. అందుకే.. బ్యాటింగ్, బౌలింగ్, స్పోర్ట్స్ సైన్స్ మెడిసిన్ కోచ్‌ల నియామకాలకు అర్హులైన వాళ్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
కోచ్‌ల ఎంపిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్లో అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలను స్పష్టంగా పేర్కొంది బీసీసీఐ. కచ్చితంగా ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ అయి ఉండాలి. లేదంటే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలి. అంతేకాదు బీసీసీఐ నుంచి కోచ్‌గా లెవల్ 2, లెవల్ 3 కోచింగ్ సర్టిఫికెట్ అయినా ఉండాలి. రాష్ట్ర స్థాయిలో లేదంటే యూత్ లెవల్లో కనీసం ఐదేళ్లు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి.
సీఓఈని ప్రారంభించిన అప్పటి బీసీసీఐ సెక్రటరీ జై షా, రోజర్ బిన్ని, రాజీవ్ శుక్లా.
ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన కూలే 2021లో ఎన్సీఏలో కోచ్‌గా చేరాడు. దాదాపు నాలుగేళ్లుగా యువ బౌలర్లు నైపుణ్యాలు మెరుగుపరచుకోవడంలో ఎనలేని కృషి చేశాడు. అయితే.. అతడి కాంట్రాక్ట్ పొడిగింపుపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కూలే వారసుడిగా వీఆర్వీ సింగ్ నియామకం లాంఛనమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఈ మాజీ పేసర్ గతంలో కూలే దగ్గర పనిచేసిన అనుభవం ఉంది. తదుపరి బౌలింగ్ కోచ్ రేసులో వీఆర్వీ సింగ్ ఉన్నట్టు సమాచారం.