న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ టైటిల్ విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు జాక్‌పాట్ దక్కింది. దక్షిణాఫ్రికాతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన తుదిపోరులో చారిత్రక విజయం సాధించిన టీమ్ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మెగాటోర్నీని కైవసం చేసుకున్న హర్మన్‌ప్రీత్‌కౌర్ సేనకు బోర్డు రూ.51కోట్ల నగదు ప్రోత్సాహం ప్రకటించింది. వరల్డ్‌కప్ టైటిల్ విజయంలో కీలకంగా వ్యవహరించిన ప్లేయర్లు, సహాయక సిబ్బంది, సెలెక్షన్ కమిటీ సభ్యులకు ఈ నజరానా అందిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా సోమవారం ప్రకటించారు. తమ అద్భుత ప్రదర్శనకు తోడు, నిబద్ధతతో జట్టుకు చారిత్రక విజయమందించిన అందరికీ గుర్తింపుగా నగదు ప్రోత్సాహం ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిల క్రికెట్‌కు పెద్దపీట వేస్తూ ఐసీసీ చైర్మన్ జైషా తీసుకొచ్చిన విధానాలతో మహిళల క్రికెట్ మరింత పురోగతి సాధించిందని సైకియా వివరించారు.
డైమండ్ జువెల్లరీ, సోలార్ ప్యానెల్స్.. 
ప్రపంచకప్ గెలిచిన టీమ్ఇండియాపై నజరానాల జడివాన కురుస్తున్నది. సూరత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి, రాజ్యసభ ఎంపీ గోవింద్ ధోలాకియా..ప్లేయర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా రాణించిన క్రికెటర్లకు డైమండ్ జువెల్లరీతో పాటు వారి ఇండ్లకు సోలార్ ప్యానెల్స్ అమర్చేందుకు సిద్ధమని సోమవారం ప్రకటించాడు. వరల్డ్‌కప్ గెలిచిన జట్టు సభ్యులకు ఈ ప్రోత్సాహం అందిస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌శుక్లాకు లేఖ ద్వారా గోవింద్ తెలియజేశాడు. మరోవైపు మెగాటోర్నీలో రాణించిన రేణుకాసింగ్ ఠాకూర్‌కు సొంత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్ కోటి రూపాయల నజరానా ప్రకటించింది.