Batsmen out in Bizzare Way | అంతర్జాతీయ క్రికెట్లో ఒక బ్యాట్స్‌మెన్.. హిట్ వికెట్‌గా అవుటవడం చాలా అరుదు. కానీ ఈసారి గంటల వ్యవధిలోనే ఇద్దరు క్రికెటర్లు హిట్ వికెట్‌గా అవుటయ్యారు. వారిలో ఒకరు టీమిండియా పేసర్ హర్షల్ పటేల్ కాగా, మరొకరు శ్రీలంక ప్లేయర్ ధనంజయ డిసిల్వ.
కివీస్‌తో జరిగిన మూడో టీ20లో బ్యాటింగ్ చేస్తున్న హర్షల్.. లోకీ ఫెర్గూసన్ బేసిన బంతిని కట్ చేయబోయే ప్రయత్నంలో వికెట్లను బ్యాటుతో కొట్టి అవుటయ్యాడు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ధనంజయ కూడా హిట్ వికెట్ రూపంలో అవుటయ్యాడు. ధనంజయ మరీ వింతగా అవుటవడంతో అతని వికెట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
వెస్టిండీస్, శ్రీలంక మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న డిసిల్వ.. షానాన్ గాబ్రియల్ వేసిన 95వ ఓవర్లో వేసిన బంతికి డిఫెన్స్ ఆడాడు. కానీ ఆ బంతి బ్యాటును తాకి వెనక్కే వెళ్లింది. దీంతో అది ఎక్కడ వికెట్లకు తగులుతుందో అని కంగారు పడిన డిసిల్వ.. బ్యాటుతో ఆ బంతిని పక్కకు కొట్టేయడానికి ప్రయత్నించాడు.
మొదటిసారి అతని ప్రయత్నం విఫలమైంది. దీంతో కంగారుపడిన అతను వెంటనే బంతిని పక్కకు కొట్టేశాడు. కానీ అలా కొట్టే కంగారులో అతని బ్యాటు వికెట్లకు తగిలింది. దీంతో అతను హిట్ వికెట్‌గా వెనుతిరిగాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ భారీ స్కోరు చేసేలా కనిపించిన డిసిల్వ ఇన్నింగ్స్ ఇలా ముగియడం శ్రీలంక అభిమానులను నిరాశకు గురిచేసింది.