హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆర్వీబీఆర్ఆర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో చాదర్‌ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్ వేదికగా జరిగిన ఎల్వీఆర్ స్మారక బాస్కెట్‌బాల్ టోర్నీ అట్టహాసంగా ముగిసింది. శనివారం జరిగిన వేర్వేరు విభాగపు ఫైనల్స్‌లో డీబీఏ(మహిళలు), సౌత్ సెంట్రల్ రైల్వే(ఎస్సీఆర్) చాంపియన్లుగా నిలిచాయి. ఆద్యంతం హోరాహోరీగా సాగిన మహిళల తుది పోరులో డీబీఏ 61-42తో ఎన్‌బీఏపై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచి తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన మ్యాచ్‌లో డీబీఏ ప్లేయర్లు సత్తాచాటారు.
కోర్టు మొత్తం కలియతిరుగుతూ కీలక పాయింట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. నేత్ర(26), మేధ(20) డీబీఏ టైటిల్ విజయంలో కీలకంగా వ్యవహరించారు. మరోవైపు పురుషుల ఫైనల్స్‌లో ఎస్సీఆర్ 66-49తో ఎన్‌బీఏపై గెలిచింది. గెలుపు కోసం ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. ఎస్సీఆర్ తరఫున సంతోష్(17), అజిత్(15) మెరుగ్గా రాణించగా, ఎన్బీఏ ప్లేయర్ బాలాజీ(20) ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోయింది.
టోర్నీ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర బాస్కెట్‌బాల్ సంఘం(టీబీఏ) అధ్యక్షుడు రావుల శ్రీధర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీబీఏ చైర్మన్ మసూద్ అహ్మద్, హైదరాబాద్ బాస్కెట్‌బాల్ ప్రతినిధులు పృద్రీద్వర్రెడ్డి, అమృత్‌రాజ్ పాల్గొన్నారు. టోర్నీలో విజేతలకు 10వేలు, రన్నరప్ టీమ్‌లకు 5వేల నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.