Sunil Gavaskar | ఈ ఏడాది భారత్-శ్రీలంక వేదికగా జరుగనున్న ఆసియా కప్ టోర్నీ నుంచి పాకిస్తాన్ తప్పుకునే అవకాశం ఉందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై పలువురు పాక్ మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేశారు. జావేద్ మియాందాద్ సహా పలువురు మాజీలు దిగ్గజ బ్యాట్స్‌మెన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్‌తో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్‌లో జరిగే టోర్నీ నుంచి పాక్ వైదొలగే అవకాశం ఉందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను బీసీసీఐ పాటిస్తుందని.. ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాదితో మ్యాచ్ ఆడేందుకు విముఖత చూపొచ్చని గవాస్కర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై మియాందాద్ ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతుతూ సన్నీ భాయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడంటే తాను నమ్మలేకపోతున్నానని తెలిపాడు.
ఇద్దరి మధ్య మైదానంలోనూ, బయటా మంచి స్నేహం ఉందన్నారు. గవాస్కర్ ఎంతో గౌరవనీయుడు, నిరాడంబర వ్యక్తని.. ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటారన్నారు. మాజీ స్పిన్నర్ ఇక్బాల్ ఖాసిం మాట్లాడుతూ.. గవాస్కర్ అలాంటి చేశారంటే తాను నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. గవాస్కర్ బాధ్యతాయుతమైన వ్యక్తని.. సరిహద్దుకు ఇరువైపులా ఆయనకు అభిమానులు ఉన్నారన్నారు. క్రీడలను రాజకీయాలతో కలపకూడదని స్పష్టం చేశారు. అయితే, మాజీ కెప్టెన్ బాసిత్ అలీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘తెలివితక్కువ మాటలు’గా.. ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపాలన్నారు. మాజీ లెగ్ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ మాట్లాడుతూ మాజీ ప్లేయర్స్ సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. హజ్రత్ అలీ మాట్లాడుతూ కోపంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని.. ఆ తర్వాత పశ్చాత్తాప పడాల్సి వస్తుందన్నారు. క్రికెట్ ప్రపంచంలో పాక్‌కు ఉన్న ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ఆయన, క్రీడలను రాజకీయం చేయొద్దన్నారు.