ఇండోర్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లో బరోడా జట్టు ప్రపంచ రికార్డు(T20 World Record) నమోదు చేసింది. టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బరోడా జట్టు 5 వికెట్ల నష్టానికి 349 రన్స్ చేసింది. ఇండోర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో బరోడా బ్యాటర్ భాను పానియా 51 బంతుల్లో 134 రన్స్ చేశాడు. ఆ రైట్‌హ్యాండ్ బ్యాటర్ 15 సిక్సర్లు, 5 బౌండరీలు బాదాడు. 260 స్ట్రయిక్ రేట్‌తో అతను స్కోరింగ్ చేశాడు. శివాలిక్ శర్మ 17 బంతుల్లో 55, విష్ణు సోలాంకి 16 బంతుల్లో 50, అభిమన్యు సింగ్ 17 బంతుల్లో 53 రన్స్ చేశారు.
టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును బరోడా సొంతం చేసుకున్నది. ఈ మ్యాచ్‌లో 37 సిక్సర్లు బాదింది బరోడా. గతంలో గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు 27 సిక్సర్లు కొట్టింది. టీ20ల్లో గతంలో ఓ సారి 300 స్కోరు దాటింది. 2023లో మంగోలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో నేపాల్ 3 వికెట్ల నష్టానికి 314 రన్స్ చేసింది.