Australian Open : ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను వరల్డ్ నంబర్ వన్ జోడీ ఎగరేసుకుపోయింది. బర్బొరా క్రెజ్సికోవ – కటేరిన సినియకోవ జోడీ డబుల్స్ టైటిల్ నెగ్గింది. ఈ జంట వరుసగా రెండోసారి ఈ టోర్నమెంట్లో విజేతగా నిలవడం విశేషం. మొదటి సారి ఫైనల్ చేరిన షుకో ఓయమ – ఎనా షిబహరా (జపాన్) జోడీని 6-4, 6-3తో చెక్‌రిపబ్లిక్ టెన్నిస్ ద్వయం చిత్తు చేసింది. క్రెజ్సికోవ – సినియకోవ బలమైన షాట్లతో విరుచుకుపడుతూ మొదటి సెట్ గెలిచారు. రెండో సెట్లోనూ పట్టు సడలించకుండా పోరాడి మ్యాచ్ ముగించారు. 24 మ్యాచుల్లోనూ పరాజయం అన్నదే ఎరుగని ఈ జంట ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ అదే దూకుడు కొనసాగించింది.
‘నా భాగస్వామి బర్బొరాకు ధన్యవాదాలు. మేము మళ్లీ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా అద్భుతమైన ప్రయాణం’ అని సినియకోవా మ్యాచ్ అనంతరం తెలిపింది. తమ జోడి వరుసగా గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో విజయం సాధించడం వెనక చాలా కష్టం ఉందని, ఎన్నో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడామని క్రెజ్సికోవా వెల్లడించింది.
7 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు
క్రెజ్సికోవ – సినియకోవ జోడీ ఖాతాలో ప్రస్తుతం 7 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. పోయిన ఏడాది ఆడిన మూడు పెద్ద టోర్నమెంట్ ఫైనల్లో వీళ్లు విజేతగా నిలిచారు. క్రెజ్సికోవ – సినియకోవ జోడీ 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లో టైటిళ్లను సొంతం చేసుకుంది.