ఢాకా: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు సారథి నిగర్ సుల్తానా జోటీపై సహచర టీమ్మేట్, పేసర్ జహనారా ఆలమ్ సంచలన ఆరోపణలు చేసింది. నిగర్.. జట్టులో జూనియర్లను కొడుతుందని.. గదికి పిలిపించుకుని మరీ వారిపై చేయి చేసుకుంటుందని ఆమె ఆరోపించింది. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలమ్ స్పందిస్తూ.. ‘ఇందులో కొత్తేమీ లేదు. జోటీ జూనియర్లను చాలాసార్లు కొట్టింది.
ఇటీవలే ముగిసిన ప్రపంచకప్ సందర్భంగా కూడా పలువురు జూనియర్ క్రికెటర్లను ఆమె కొట్టినట్టు వారు నాతో చెప్పారు. దుబాయ్ పర్యటనలోనూ ఇదే జరిగింది’ అని వ్యాఖ్యానించింది. జట్టులో సీనియర్లను పక్కనబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని గతంలో కెప్టెన్‌గా చేసిన తననూ అలాగే చేశారని ఆమె దుయ్యబట్టింది. కాగా ఆలమ్ కామెంట్స్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) స్పందించింది. అవి నిరాధార ఆరోపణలని.. జట్టు స్ఫూర్తిని దెబ్బతీయడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని తెలిపింది.