Nagin Dance | ఆసియాకప్లో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. టోర్నీ రెండో మ్యాచ్లో భాగంగా గురువారం బంగ్లాదేశ్, శ్రీలంక తలపడుతుండగా.. లంక బౌలర్ల ధాటికి బంగ్లా 164 పరుగులకే కుప్పకూలింది. సొంత గడ్డపై తమ పేసర్లు రాణించడంతో బంగ్లా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (5), తన్జిద్ హసన్ (0) ఘోరంగా విఫలం కాగా.. మహమ్మద్ నయీమ్ (16), తౌహిద్ (20), ముష్ఫికర్ రహీమ్ (13) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. నజ్ముల్ హసన్ షాంటో (89) ఒంటరి పోరాటం చేయడంతో బంగ్లాదేశ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లంక బౌలర్లలో పతిరణ 4, తీక్షణ రెండు వికెట్లు పడగొట్టగా.. సమన్వయ లోపంతో మహెదీ హసన్ మిరాజ్ (5) రనౌటయ్యాడు.
బంగ్లాదేశ్ జట్టు 42.4 ఓవర్లలోనే ఆలౌట్ కావడంతో లంక అభిమానులు తమదైన శైలిలో సంబురాలు జరుపుకున్నారు. గత ఆసియాకప్ సమయంలో నాగిని డ్యాన్స్ ఫుల్ ఫేమస్ అయింది. బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగిన పోరులో ఆధిక్యం చేతులు మారుతున్న సమయంలో బంగ్లా పేయర్లు మైదానంలో చేతులు తలపై పెట్టి నాగిని డ్యాన్స్ చేస్తూ లంకేయులను విసిగించారు. వికెట్ తీసిన ప్రతిసారి ఇదే విధంగా సంబురాలు జరుపుకున్నారు. కాగా.. చివరికి మ్యాచ్లో లంక విజయం సాధించగా.. డ్రెస్సింగ్ రూమ్లో శ్రీలంక ప్లేయర్లు కూడా నాగిని డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య జరిగిన ప్రతిసారి నాగిని డ్యాన్స్ సంబురాల గురించి చర్చ సాగుతుండగా.. తాజా పోరులో బంగ్లా బ్యాటర్లు విఫలమవడంతో లంక ఫ్యాన్స్ మరోసారి నాగిని డ్యాన్స్ చేస్తూ కనిపించారు.