Dhaka Premier League : ఆట ఏదైనా సరే మైదానంలో ప్రత్యర్థితో కవ్వింపులు, అంపైర్లతో వాగ్వాదాలు మామూలే. అయితే.. కొన్నిసార్లు గొడవలు శ్రుతిమించితే మాత్రం వేటు తప్పదు. క్రికెట్లో ఇలాంటి సంఘటలను ఇప్పటివరకూ చాలానే జరిగాయి. తాజాగా ఓ యువ క్రికెటర్ అంపైర్‌తో గొడవకు దిగినందుకు భారీమూల్యం చెల్లించుకున్నాడు. బంగ్లాదేశ్ యువ క్రికెటర్ తౌహిద్ హృదొయ్(Towhid Hridoy) ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. అసలేం జరిగిందటే..?
స్వదేశంలో జరుగుతున్న ఢాకా ప్రీమియర్ లీగ్‌లో తౌహిద్ హృదొయ్ ‘మొహమ్మదన్ స్పోర్టంగ్ క్లబ్’ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఆదివారం అబహని లిమిటెట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ తన్వీర్ అహ్మద్ ఒక బ్యాటర్‌ను ఎల్బీగా ఔట్ ఇవ్వలేదు. దాంతో, హృదొయ్ అతడి నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. స్క్వేర్ లెగ్‌లో ఉన్న అంపైర్‌తో ఈ విషయం గురించి మాట్లాడుతూ కోపంగా వేలెత్తి చూపించాడు.
🚨 HRIDOY SUSPENDED ❌
For the exchanged heat between Tawhid Hridoy and the umpires in today’s DPL match, he faces a one-match suspension with 4 demerit points!#DPL2025 pic.twitter.com/lz41DI0q6S
— Cricketangon (@cricketangon) April 12, 2025
మైదానంలో అందరిముందు అంపైర్ పట్ల ఈ యువకెరటం తీరుతో ఆగ్రహించిన మ్యాచ్ రెఫరీ.. ఈ విషయాన్ని డీపీఎల్ క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లాడు. అంపైర్ మాటకు గౌరవం ఇవ్వకపోగా.. అతడితో వాదులాడినందుకు హృదోయ్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించింది కమిటీ. అంతేకాదు నాలుగు డీమెరిట్ పాయింట్లు కూడా కేటాయించింది.దాంతో, తర్వాతి మ్యాచ్‌కు ఈ యంగ్‌స్టర్ దూరం కానున్నాడు. కానీ, హృదయ్ మాత్రం ఇందులో తన తప్పేమీ లేదని వాపోతున్నాడు. ‘ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసి ఉంటే ధైర్యంగా అంగీకరిస్తాను. కానీ, అంపైర్ పొరపాటు చేయడమే కాకుండా అసలు తాను ఎలాంటి తప్పు చేయలేదని సమర్దించుకోవడం నిజంగా బాధాకరం’ అని వెల్లడించాడీ యంగ్ ప్లేయర్.