ఢాకా: బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్(Mushfiqur Rahim) వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియా అకౌంట్ ద్వారా బుధవారం రాత్రి తన నిర్ణయాన్ని వెల్లడించాడు. తాజాగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో 37 ఏళ్ల రహీమ్ ఆడాడు. అయితే ఆ జట్టు గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని, దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటున్నానని, ప్రపంచ స్థాయిలో తమ జట్టు పాక్షికంగా రాణించిందని, కానీ ప్రతిసారి జట్టు కోసం వంద శాతం అంకితభావంతో ఆడినట్లు చెప్పాడు. ఫేస్బుక్ పేజీలో రహీమ్ ఈ విషయాన్ని చెప్పాడు.
2006లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు రహీమ్. దాదాపు 20 ఏళ్లు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 274 వన్డేలు ఆడాడు. బంగ్లా తరపున అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్‌గా ముష్ఫికర్ రహీమ్ నిలిచాడు. అతను వన్డేల్లో 36.42 సగటుతో 7795 రన్స్ చేశాడు. బంగ్లా బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ ఒక్కడే రహీమ్ కన్నా ఎక్కువ పరుగులు చేశాడు. ముష్ఫికర్ తన కెరీర్లో 94 టెస్టులు, 102 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టీ20ల నుంచి రహీమ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల్లో మాత్రం ఇంకా ఆడుతున్నాడు.
50 ఓవర్ ఫార్మాట్లో ముష్ఫికర్ రహీమ్ 9 సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలు చేశాడు. గడిచిన కొన్ని వారాలు తన కెరీర్లో ఛాలెంజింగ్‌గా మారాయని, కానీ వాస్తవాన్ని గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రహీమ్ తెలిపాడు. బ్యాటర్‌గానే కాదు.. కీపర్‌గా కూడా రహీమ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ముషిఫికర్ తన వన్డే కెరీర్లో కీపర్‌గా 297 మందిని ఔట్ చేశాడు. ఆల్ టైం కీపర్ల లిస్టులో సంగక్కర, గిల్‌క్రిస్ట్, ధోనీ, బౌచర్ తర్వాత ముష్ఫికర్ నిలిచాడు.