రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వరుస విజయాలతో దూసుకెళుతున్నది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ప్లేఆఫ్స్ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ఆదివారం డబుల్ ధమాకాలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత విజయం సొంతం చేసుకుంది. డుప్లెసిస్, పాటిదార్‌కు తోడు ఆఖర్లో కార్తీక్ మెరుపులతో పోరాడే స్కోరు అందుకున్న ఆర్సీబీ..హసరంగ హై ఫైవ్ ప్రదర్శనతో రైజర్స్ భరతం పట్టింది.
ముంబై: హైదరాబాద్‌పై బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంది. ఆర్సీబీ 67 పరుగుల తేడాతో రైజర్స్పై ఘన విజయం సాధించింది. దీంతో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలువగా, వరుసగా నాలుగో ఓటమితో హైదరాబాద్ ఆరో స్థానానికి పరిమితమైంది. తొలుత కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(50 బంతుల్లో 73 నాటౌట్, 8ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీకి తోడు రజత్ పాటిదార్(48), మ్యాక్స్‌వెల్(33), దినేశ్ కార్తీక్(8 బంతుల్లో 30 నాటౌట్, ఫోర్, 4 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ 20 ఓవర్లలో 192/3 స్కోరు చేసింది. పరుగుల ఖాతా తెరువకుండానే ఓపెనర్ విరాట్ కోహ్లీ(0) వికెట్‌ను బెంగళూరు కోల్పోయింది. జగదీశ సుచిత్ బౌలింగ్‌లో విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. కోహ్లీ నిష్క్రమించినా..డుప్లెసిస్, పాటిదార్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరు సమయోచిత ఆటతీరుతో పరుగులు కొల్లగొట్టారు.
ఇన్నింగ్స్ జోరందుకుంటున్న తరుణంలో సుచిత్ బౌలింగ్‌లో పాటిదార్ ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్, కార్తీక్.. రైజర్స్ బౌలర్ల దుమ్ముదులిపారు. కార్తీక్ నాలుగు భారీ సిక్స్‌లతో ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశాడు. సుచిత్‌కు రెండు వికెట్లు దక్కగా, త్యాగి ఒక వికెట్ తీశాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రైజర్స్..19.2 ఓవర్లలో 125 పరుగులకు కుప్పకూలింది. హసరంగ డిసిల్వా(5/18) ధాటికి రాహుల్ త్రిపాఠి(37 బంతుల్లో 58, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్లు అభిషేక్‌శర్మ(0), విలియమ్సన్(0) సున్నాలు చుట్టారు. తన స్పిన్ మాయాజాలంతో మక్రామ్ (21), పూరన్(19), సుచిత్(2), శశాంక్సింగ్(8), ఉమ్రాన్ మాలిక్(0)ను ఔట్ చేసి హైదరాబాద్‌ను హసరంగ కోలుకోలేని దెబ్బ తీశాడు. ఐదు వికెట్లతో జట్టు విజయంలో కీలక భూమిక పోషించిన హసరంగకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ఐపీఎల్ 15వ సీజన్ లో బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మూడు మార్లు గోల్డెన్ డక్ ఔటయ్యాడు. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రెండు సార్లు కాగా, లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో మరోమారు నిష్క్రమించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో కోహ్లీకి ఆరో డకౌట్ ఇది.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లలో 192/3 (డుప్లెసిస్ 73 నాటౌట్, పాటిదార్ 48, సుచిత్ 2/30, త్యాగి 1/42), హైదరాబాద్: 19.2 ఓవర్లలో 125 ఆలౌట్(త్రిపాఠి 58, మక్రామ్ 21, హసరంగ 5/18, హాజిల్‌వుడ్ 2/17)