కరాచి : అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు నాయకత్వానికి బాబర్ అజామ్ గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు అతడు నిర్ణయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశాడు. మూడు ఫార్మాట్లలో ఆటగాడిగా కొనసాగుతానని, కొత్త కెప్టెన్‌కు తన పూర్తి సహకారాన్ని అందజేస్తానని అజామ్ తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో పాకిస్తాన్ నిరాశాజనక ప్రదర్శనతో విమర్శలు చెలరేగడంలో అజామ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు షహీన్ షా అఫ్రిదిని టి20 కెప్టెన్‌గా, షాన్ మసూద్‌ను టెస్టు కెప్టెన్‌గా నియమించింది. డిసెంబర్లో ఆసీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌తో మసూద్ నాయకత్వం ప్రారంభం కానుండగా, జనవరిలో న్యూజిలాండ్‌తో అయిదు మ్యాచ్‌ల సిరీస్‌తో అఫ్రిది తొలిసారి జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. సమీప భవిష్యత్తులో పాక్ జట్టుకు వన్డే మ్యాచ్‌లేమీ లేకపోవడంతో ఆ ఫార్మాట్‌కు కెప్టెన్‌ను ప్రకటించలేదు.